
వైసీపీలో ఎవరైనా అరెస్ట్ కాబోతున్నామని తెలిస్తే హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. కానీ వారి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి “అరెస్ట్ కావడం చాలా ఇబ్బందికరమే. కానీ మద్యం కుంభకోణం కేసులో కూటమి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడే ఉన్నాను. ఎక్కడికీ పారిపోలేదు,” అంటూ తన అరెస్ట్ గురించి ముందస్తు ప్రకటన చేశారు.
యధారాజా అన్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “వల్లభనేని వంశీ చనిపోతే అందుకు సిఎం చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలి,” అని హెచ్చరించారు.
Also Read – బిఆర్ఎస్ బతకాలి అంటే ఏపీ చావాలా.?
ఈరోజు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “వంశీకి తగిన చికిత్స, వైద్య పరీక్షలు చేయించకుండా కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వంశీ మరణమే టీడీపీ సమాధి అవుతుంది,” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
వల్లభనేని వంశీ తన ఆరోగ్యం బాగోలేదని చెప్పినందునే పోలీసులు ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నారు. పేర్ని నాని వైసీపీ నేతలను వెంటబెట్టుకొని ఆస్పత్రికే వచ్చి ఆయనని పరామర్శించారు. అదే ఆస్పత్రి బయట నిలబడి వంశీ చావు గురించి మాట్లాడుతున్నారంటే, వైసీపీయే ఆయన చావు కోరుకుంటోందని, ఒకవేళ ఆయన పోతే ఆయన పేరుతో శవరజకీయాలు చేసి కూటమి ప్రభుత్వంపై పై చేయి సాధించాలని ఆశపడుతోందేమో? అని అనుమానం కలుగుతోంది.