ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణగా పేరుపొందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. రాష్ట్ర విభజనతోనే ఆంధ్రప్రదేశ్ కోలుకోలేని విధంగా నష్టపోయిన మాట వాస్తవం.విభజన తరువాత అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేసింది. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాలనను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వాలు మారితే పాలించే వాడు మారతాడు, పాలన తీరు మారుతుంది అనుకున్న రాష్ట్ర ప్రజలకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన షాక్ మాములుగా లేదు.ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితికి రాష్ట్రం దిగజారిందనే చెప్పాలి.
రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను దేశ ప్రజల ముందు నిలబెట్టిన ఘనత జగన్ కు మాత్రమే దక్కుతుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో ఇప్పుడు అల్లర్లతో, నిరసనలతో, అలజడులతో,కక్ష రాజకీయాలతో ఒక అశాంతి వాతావరణాన్ని సృష్టించడంలో వైసీపీ ప్రభుత్వం తనవంతు కృషి చేసి విజయాన్ని సాధించింది. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి సంబరాలు చేసుకుంటున్న మంత్రులు ఒకవైపు, జైలుకు వెళ్లిన బాబుని దోషిగా భావించి శిక్షలు కూడా వేసేస్తున్న నేతలు మరో వైపు. ఇక రాష్ట్రంలో న్యాయవాదులకు, న్యాయమూర్తులకు సెలవు చీటీ ఇచ్చి న్యాయవ్యస్థలను కూడా వైసీపీ నాయకులే నడిపిస్తారేమో మరి!
తప్పు చేసాడు కాబట్టే చంద్రబాబు ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. ఎన్టీఆర్ కు బాబూ చేసిన అన్యాయానికి బాబు ఎలాంటి చావు చస్తాడో చూద్దాం. చంద్రబాబు చేసిన తప్పుకి ఈశిక్ష సరిపోదు, బాబుని నడిరోడ్డు మీద ఉరితీయాలి అంటూ వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీ యొక్క అధికార అహంకారానికి నిదర్శనం అనే భావించాలి.
తప్పు జరిగిందో లేదో ఇంకా న్యాయస్థానాలు నిర్దారించనే లేదు. వైసీపీ నేతలు మాత్రం శిక్షలు ఖరారు చేసేస్తున్నారు.ఒకవేళ తప్పు జరిగితే అందుకు తగ్గ శిక్షలు న్యాయమూర్తులకు త్తెలియవనా? లేక ఇటువంటి శిక్షలే ఖరారు చేయాలనీ వైసీపీ నాయకులే న్యాయవ్యవస్థలకు సలహాలు ఇస్తున్నారా? బాబుని విమర్శించడానికి ఎన్టీఆర్ పేరు అడ్డుపెట్టుకుంటూ జగన్ అండ్ కో చేస్తున్న ఈ రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన ఎన్టీఆర్ వారసుల అలసత్వమే హద్దులు దాటిన విమర్శలకు సాక్ష్యాలుగా మిగులుతున్నాయి.
ఒక్క బాబు విషయమే కాదు, రాష్ట్రానికి వచ్చి రాగానే లోకేష్ అరెస్టు, ఆ పిదప బాబు కుటుంబసభ్యుల మీద కూడా కేసులు – అరెస్టుల పర్వం కొనసాగుతుందని పోలీస్ వ్యవస్థ పనులు కూడా సదరు వైసీపీ నేతలే చెప్పేస్తున్నారు. తమ నేతకు సంఘీభావం పలకడానికి రాష్ట్రానికి వచ్చిన ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు, బాబు కు మద్దతు పలికిన జనసేనాని పవన్ ను రోడ్డు మీద నిర్బంధించిన తీరు, బాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన మోత మోగించండి కార్యక్రమంలో పాల్గొన్న వారి పై కేసులు మోపడం చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏంజరుగుతుంది? అంటూ పక్క రాష్ట్రాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి.
ఆదేశాలు ఇచ్చేవారికి సరే కనీసం అమలు చేసే వారికైనా బుద్ధి ఉండాలిగా? అంటూ లోకేష్ తన x మాధ్యమం ద్వారా స్పందించారు. పసుపు రంగు బట్టలు వేసుకున్నారని, బాబు అరెస్టును టీవీల ద్వారా చూస్తున్నారని, సైకిలు అగరబత్తీలు కొంటున్నారని, అమ్ముతున్నారని కూడా రానున్న రోజులలో జగన్ ప్రభుత్వం కేసులు పెడుతుందేమో! ఇక రాష్ట్రంలో అందరి మీద రాజద్రోహం కేసుపెట్టి ఉరి తీసేయండి సరిపోతుంది అంటూ లోకేష్ జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టె వ్యాపారవేత్తలు ఎందుకు వెనకడుగు వేసారో రాష్ట్రప్రజలకు ఇప్పటికి అవగతం అవుతున్నట్లుంది.



