జగన్‌ తెలియక తప్పులు చేస్తున్నారా?

Jagan Press Meet

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలు వినే నిరక్షరాస్యులు, గ్రామీణులు కూడా స్పందించకుండా ఉండలేరు. ఇక జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు ఎలా మౌనంగా ఉండగలరు?

ఇక జగన్‌ని విమర్శించబోమని ఒట్టేసుకున్న రాజకీయ విశ్లేషకులు సైతం ఒట్టు తీసి గట్టుమీద పెట్టి మళ్ళీ జగన్‌ విచిత్ర ధోరణి గురించి రాయక తప్పడం లేదు.

ADVERTISEMENT

ప్రెస్‌మీట్‌ తర్వాత జగన్‌ బెంగళూరు వెళ్ళిపోతుంటారు. అందుకే మంత్రి నారా లోకేష్‌ ఆయనకు ‘బెంతాహై’ అని ముద్దు పేరు పెట్టారు. బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్‌ మద్య తిరుగుతుంటారు కనుక వాటి మొదటి అక్షరాలు తీసుకొని ‘బెంతాహై’ అని ముద్దు పేరు పెట్టారు.

“రప్పా రప్పా నరికేస్తామని మీరే అంటున్నారు కనుక మీది గొడ్డలి పార్టీ అంటే ఎందుకు బాధ పడుతున్నారు?” అని నారా లోకేష్‌ ప్రశ్నించారు.

ఈ బెంతాహై, గొడ్డలి పార్టీ ఆక్షేపణలు టీడీపి శ్రేణులను ఉత్సాహపరచడానికే అనుకున్నా, అవి జగన్‌, వైసీపీ తీరుకి అద్దం పడుతున్నాయి కదా?

వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా’ అంటూ పోస్టర్స్ వేసినప్పుడే వారిని జగన్‌ వారించి ఉండాలి. కానీ వారిని వెనకేసుకు రావడంతో నడిరోడ్డుపై జగన్‌ ఫోటోతో ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి దాని ఎదుట గొర్రెలు, మేకలు, కోళ్ళు బలిచ్చి రక్తాభిషేకం చేశారు.

కనీసం అప్పుడైనా జగన్‌ వారిని వారించి ఉండాలి కదా? కానీ ఊరుకున్నారు. తద్వారా ‘నరుకుడే’ వైసీపీ విధానమని జగన్‌ స్వయంగా ధ్రువీకరించినట్లే కదా?

ఈవిధంగా చేస్తూ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నవారికి జగన్‌ ఎటువంటి సంకేతాలు పంపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు నాయుడు మావిగన్‌ అంటే గుండె ఆగి చనిపోతారంటూ జగన్‌ మాట్లాడిన మాటలు, నేను చాలా మంచివాడిని, సౌమ్యుడిని, నా పార్టీ నేతలందరూ ఆణిముత్యాలే అని సెల్ఫ్ సర్టిఫై చేసుకుంటూ మాట్లాడిన మాటలఫై రాష్ట్ర ప్రజలు, సోషల్ మీడియాలో కూడా ఎటువంటి చర్చలు జరుగుతున్నాయో జగన్‌కు తెలియవనుకోలేము.

కానీ ఓ సినిమాలో హీరో ‘నా ప్రేమను కోపంగానో… నా ప్రేమను ద్వేషంగానో ఫీల్ మై లవ్..” అంటూ పాడినట్లుగానే జగన్‌ కూడా తన గురించి ప్రజలు మంచిగా లేదా చెడుగా అనుకున్నా పర్వాలేదు కానీ రోజూ తన గురించి మాట్లాడుకుంటే చాలని కోరుకుంటున్నట్లే ఉంది కదా?

సింగిల్ సింహాన్ని అని గొప్పలు చెప్పుకునే జగన్‌ నేరుగా చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని ఢీ కొనే బదులు, ఓసారి ముద్రగడని, మరోసారి టైగర్ రాంబాబుని, మరోసారి ప్రొఫెసర్ నాగేశ్వర్ లేదా మరొకరి ద్వారా తాను చెప్పాలనుకున్న మాటలు చెప్పిస్తుంటారు. చేయాలనుకున్న చెడ్డ పనులు చేయిస్తుంటారు. వాటికి వారు బలైపోతే జగన్‌ సింపుల్‌గా పక్కకు తప్పుకుంటారు.

ఇందుకు చక్కటి తాజా నిదర్శనంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి చెప్పుకోవచ్చు. అయన వెనుక జగన్‌ ఉన్నారో లేదో తెలీదు కానీ జగన్‌కు అనుకూలంగా ఆవిధంగా మాట్లాడినందుకు అయన ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటుంటే జగన్‌ పట్టన్నట్లు ఊరుకున్నారు.

తప్పుడు విధానాలతో పార్టీని నడిపిస్తూ రాజకీయాలను ఇంకా ఇంకా కలుషితం చేస్తుంటే మళ్ళీ తాను, వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని జగన్‌కి తెలియకనే చేస్తున్నారా? అంటే కాదనే చెప్పాలి. మరి తెలిసి చేస్తున్న ఈ తప్పులని ఏవిధంగా చూడాలి?

ADVERTISEMENT
Latest Stories