తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు మరో రెండు కొత్త కార్యక్రమాలను ప్రకటించారు. ఈ నెల 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మన భవిష్యత్తు’ అనే ఓ కార్యక్రమం, ఈ నెల 13 నుంచి ‘జగనన్నకు చెబుదాం’ అనే ఓ కార్యక్రమం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
మొదటి కార్యక్రమంలో ప్రతీ లబ్ధిదారుడి ఇంటి గోడలపై, వారి సెల్ ఫోన్ల వెనుక ‘నువ్వే మా నమ్మకం జగన్’ స్టిక్కర్స్ అంటించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు.
జగనన్నకు చెపుదాం కార్యక్రమంలో వ్యక్తిగత స్థాయిలో ప్రజా సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పరిష్కరిస్తుందని చెప్పారు. అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాలలో గడప గడపకి వెళ్ళి ప్రజలను కలిసి పింఛన్లు, రేషన్ కార్డులు రాకపోవడం వంటి సమస్యలనుముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్ళాల్సి ఉంటుందన్న మాట!
వాలంటీర్లు నెలనెలా ఇంటికి వచ్చి పింఛనులు అందిస్తూ, సంక్షేమ పధకాలు అందేలా చేస్తున్నందున చాలామంది ప్రజలు తమ కంటే వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. వాలంటీర్ల వలన ప్రజలకు తాము దూరమైపోయామని, నేరుగా ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయని, ఇది ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు ప్రజాసమస్యలను నేరుగా ముఖ్యమంత్రే పరిష్కరిస్తారంటే ఇక తమను పట్టించుకొనేదెవరని ప్రజాప్రతినిధులు ఆందోళన చెందడం సహజం. వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులుగా ఎవరిని నిలబెట్టినప్పటికీ, ప్రజలు వారిని చూసి కాక జగన్ ఫోటోని చూసే వారికి ఓట్లు వేసేందుకు ముందస్తు ఏర్పాటు ఇదనుకోవచ్చు. కనుక అసంతృప్తిరాగాలు తీస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో మరొకరిని నిలబెట్టవచ్చన్న మాట!
మరో కార్యక్రమానికి ‘జగన్నన్నే మన భవిష్యత్తు’ అని పేరు ఖరారు చేసిన్నట్లున్నారు. అంటే వైసీపీ అంటే జగనన్న తప్ప మంత్రులు, ఎమ్మేల్యేలు కాదనుకోవచ్చు. అయినప్పటికీ మీరూ కాస్త గ్రాఫ్ పెంచుకొంటే గెలవడం సులువవుతుందని చెపుతున్నారనుకోవచ్చు. ఒకవేళ గ్రాఫ్ పడిపోయినా ‘సర్వం జగన్నాధం’ కనుక ఎవరో ఒకరిని నిలబెట్టి గెలుచుకొనే ‘ఆప్షన్’ వీటితో ముందే ఏర్పాటు చేసుకొంటున్నారు కనుక ఎవరైనా తోక జాడించినా ఇబ్బంది ఉండదు. గడప గడపకి వెళ్ళి ఇప్పటికే ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతుంటే, ఇప్పుడు ఈ రెండు కార్యక్రమాలతో పార్టీలో తోక జాడిస్తున్న వారందరికీ జగనన్న ‘చెక్’ పెడుతున్నట్లే భావించవచ్చు. అంటే వారి వేలితోనే వారి కళ్ళను పొడిపిస్తున్నారనుకోవాలేమో?



