ఒకప్పుడు భారత స్టాక్ మార్కెట్ అంటే పెద్ద పారిశ్రామికవేత్తలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సంపన్న వర్గాలు, ఆర్థిక రంగంలో నిపుణులకు మాత్రమే పరిమితమైన ఆటస్థలంగా భావించేవారు. కానీ గత రెండు దశాబ్దాలుగా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, ఐటీ ఉద్యోగులు సైతం స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నారు.
సాంకేతికత అందుబాటులోకి రావడం, ఆన్‌లైన్ ట్రేడింగ్ వేదికలు విస్తరించడం, ఆర్థిక స్థోమత, అవగాహన పెరగడం వంటి కారణాలతో చిన్న పెట్టుబడిదారులు భారీ సంఖ్యలో మార్కెట్‌లోకి అడుగుపెట్టారు.
ముఖ్యంగా కరోనా మహమ్మారి అనంతరం ఈ మార్పు మరింత వేగం అందుకుంది. బ్యాంకు డిపాజిట్లపై తగ్గిన వడ్డీ రేట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగిన పెట్టుబడి అవగాహన, తక్కువ మొత్తాలతోనే పెట్టుబడులు పెట్టే అవకాశం వంటి అంశాలు లక్షలాది మందిని స్టాక్ మార్కెట్ వైపు ఆకర్షించాయి.
ఒకప్పుడు మార్కెట్ దిశను నిర్ణయించడంలో ప్రధానంగా విదేశీ పెట్టుబడిదారులదే కీలక పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు దేశీయ చిన్న పెట్టుబడిదారుల పెట్టుబడులు కూడా మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి.
విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లిన సందర్భాల్లో కూడా దేశీయ పెట్టుబడిదారుల కొనుగోళ్లు మార్కెట్‌కు అండగా నిలిచిన ఉదాహరణలు ఇటీవల చాలానే కనిపించాయి.
అయితే స్టాక్ మార్కెట్‌లో సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చనే అపోహతో అడుగుపెడుతున్న చిన్న పెట్టుబడిదారుల్లో చాలామంది తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. దీనికి తోడు ఇటీవల యుద్ధ ప్రభావాల వల్ల భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలకు లోనవడంతో చిన్న పెట్టుబడిదారుల్లో మళ్లీ పునరాలోచన మొదలైంది.
అనేకమంది మళ్లీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల వైపు మళ్లుతున్నారు.
కనుక భారతీయ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవాహంలా వచ్చిన చిన్న పెట్టుబడిదారులు మళ్లీ వెనక్కి వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, సెబీ, బ్రోకరేజ్ సంస్థలు ఎప్పటికప్పుడు వారి పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు తగిన రక్షణ చర్యలు, జాగ్రత్తలు చేపడితే మంచిది.
తద్వారా చిన్న పెట్టుబడిదారులు కూడా భారత స్టాక్ మార్కెట్ ప్రపంచ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడేందుకు దోహదపడతారు.




