సిఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అలయన్స్ టైర్స్ కంపెనీకి ప్రారంభోత్సవం చేశారు. మరో 8 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఏపీవైపు చూసేవారు కారని కానీ ఇప్పుడు రాష్ట్రానికి క్యూ కడుతున్నారని చెప్పారు.
సిఎం జగన్ చెప్పుకొంటున్న ఈ గొప్పలపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో స్పందిస్తూ, “సిఎం జగన్ పదో క్లాసు పాస్ డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తున్న కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినవే. కియా, ఫాక్సాన్, ఏషియన్, బర్జర్ పెయింట్స్, అపోలో టైర్స్ వంటి అనేక పరిశ్రమలను చంద్రబాబు నాయుడే తీసుకువచ్చారు. వోల్టాస్, హెచ్‌యస్‌బీసీ వంటి అనేక సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నాయి. కియా మోటార్స్ అనుబంద సంస్థలు (యాన్సిలరీ యూనిట్స్) కూడా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి.
నిజానికి వైసీపీ పాలనలో రాష్ట్రానికి కొత్తగా వచ్చిన పరిశ్రమల కంటే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినవే ఎక్కువున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి ఏ పారిశ్రామికవేత్త ముందుకు వస్తాడు? వేదాంత ఛైర్మన్ రాఘవగారు స్వయంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులను చెపుతున్నారు. జగన్ అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్తలు, కంపెనీలతో టిడిపి ప్రభుత్వం చేసిన ఒప్పందాలన్నిటినీ క్యాన్సిల్ చేశారు కదా?వైసీపీ ప్రభుత్వం ఈవిదంగా వ్యవహరిస్తుంటే రాష్ట్రానికి ఎవరొస్తారు?
ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పరిశ్రమ పెట్టడానికి ముందుకు వస్తే నాకు వాటా ఎంతిస్తావు?అని అడుగుతుంటారు. రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమ స్థాపించడానికి వస్తే సిఎం జగన్మోహన్ రెడ్డికి, ఆయన సతీమణికి, ఆయన జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఎవరెవరికి ఎంతెంత వాటాలు ఇవ్వాలనే చర్చ నడుస్తుంది. అందుకే ఈ మూడేళ్ళలో అనేక పెద్ద పెద్ద ఐటి కంపెనీలు, పరిశ్రమలు అన్నీ పక్కనే ఉన్న తెలంగాణ, వెళ్ళిపోతున్నాయి.
అసలు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఎవరు వస్తారు? కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు తెచ్చిన పరిశ్రమలకు రిబ్బన్ కటింగ్ చేసి ఏపీకి భారీ పరిశ్రమలు తీసుకువచ్చామని సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు,” అని ఎద్దేవా చేశారు.
అలయన్స్ టైర్స్ ఉత్పత్తి ప్రారంభం అయ్యిందంటే దానర్ధం చంద్రబాబు నాయుడు హయాంలో ఒప్పందం కుదిరి, దానికి అనుమతులు, భూమి కేటాయింపు వగైరాలన్నీ జరిగిన తర్వాత ఆ ప్లాంట్ నిర్మాణం ఇప్పటికీ పూర్తయిందనే కదా?కానీ దానిని తానే తీసుకువచ్చి స్థాపించినట్లు గొప్పలు చెప్పుకోవడం దేనికి?అలాగే సిఎం జగన్మోహన్ రెడ్డి నిన్న శంకుస్థాపన చేసినవన్నీ ప్లాంట్ విస్తరణ పనులకే. అంటే అవి కూడా ఇప్పటికే ఉత్పత్తి కొనసాగిస్తున్నాయని స్పష్టం అవుతోంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటైన ఆ కంపెనీలు ప్లాంట్ విస్తరణ చేపడితే అవి కొత్తగా వచ్చిన పరిశ్రమల కింద చెప్పుకోవడం సిగ్గుచేటు కదా?
ఏపీలో ఆదానీ డాటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు హయాంలోనే ఒప్పందం జరిగింది. కానీ దానిని తానే తీసుకువచ్చినట్లు జగన్ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆదానీ కంపెనీతో ఏపీలో డాటా సెంటర్ ఏర్పాటుకి ఒప్పందం చేసుకొన్న ఫోటో, ఆ తర్వాత విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఈ ఫోటోలే ఇందుకు సాక్ష్యం.
అయినా మూడేళ్ళుగా సంక్షేమ పధకాల గోల, రాజకీయ కక్ష సాధింపులు తప్ప ఏనాడూ పారిశ్రామికాభివృద్ధిని పట్టించుకొన్నప్పుడు ఏపీకి పరిశ్రమలు ఎలా వచ్చేస్తాయి?అని ఆలోచిస్తే నారా లోకేష్ వాదన సహేతుకమైనదని అర్దం అవుతుంది.



