andhra-pradesh-jagan

ఈ వర్షా కాలంలో హైద్రాబాద్ వాసుల కష్టాలకు ఎడతెరిపి ఉండదు. రోడ్లు చెరువులను తలపిస్తాయి, ట్రాఫిక్ సమస్యలతో వాహనదారుల ఇక్కట్లకు అంతే ఉండదు. స్కూల్ పిల్లల నుండి ఉద్యోగాలకు వెళ్లే వారి వరకు అందరిని వేధిస్తున్న సమస్యలివే. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఆయనే రావాలి.

Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!

రావాలి జగన్…కావాలి జగన్ మన జగన్ అంటూ తెలంగాణ వాసులు జగన్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే హైద్రాబాద్ వాసుల కష్టాలకు ఎండ్ కార్డు పడ్డట్టే. ఒకవేళ తెలంగాణకు జగన్ ముఖ్యమంత్రి అయితే జగన్ చేసే మొట్టమొదటి కార్యం రాజధాని మార్పేనేమో. ఎందుకంటే తెలంగాణ రాజధానిగా ఉన్న మహా నగరం హైద్రాబాద్ చిన్న పాటి వర్షానికి సైతం అల్లాడుతూ నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతూ ఉంటుంది.

ఈ సమస్యకు పరిష్కారం చూపడం ఏ ప్రభుత్వానికి, ఏ ముఖ్యమంత్రికి చేతకావడం లేదా? ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా, ఎన్ని మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చినా సమస్య మాత్రం తీరడం లేదా? అయితే ఎటువంటి సమస్యనైనా తన విధ్వంసకర ఆలోచనతో మాయచేయగలరు జగన్.

Also Read – జమ్ము కశ్మీర్‌ దాడి: అందరి తాపత్రయం మైలేజ్ కోసమే?

కొత్తగా ఏర్పడిన ఏపీ రాజధాని అమరావతిని వరద ప్రాంతంగా ప్రకటించి రాష్ట్రాన్ని మూడు ముక్కలాట ఆడుకున్నారు జగన్. దీనితో అసలు రాష్ట్రానికి పెట్టుబడులే రాలేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు రావు, ప్రజలు వలస వెళ్లిపోయారు, దీనితో ఏపీ రోడ్ల మీద ట్రాఫిక్ సమస్యలే లేవు.

ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకపోతే అసలు రోడ్లు బాగు చెయ్యాల్సిన అవసరమే లేదని ఐదేళ్లు గుంతలు పడ్డ రోడ్లను కూడా పూడ్చలేదు జగన్ ప్రభుత్వం. జగన్ తీసుకున్న ఒకేఒక్క నిర్ణయంతో ఏపీ సగం ఖాళీ అయ్యింది. అలాగే ఇప్పుడు తెలంగాణకు జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ సమస్యలన్నిటికీ ఒకే నిముషంలో ముగింపు ఇవ్వగలరు.

Also Read – ఉల్ఫా బ్యాచ్ అట… జగన్‌ హర్ట్ అవరూ?

ఐటీ రంగంతో ఎన్నో కోట్ల సంపద సృష్టికి, ఎన్నో లక్షల కుటుంబాల ఉపాధికి సాక్షిగా నిలిచిన హైద్రాబాద్ ను రాష్ట్ర రాజధాని పదవి నుండి తొలగిస్తే ఈ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుందని జగన్ కు ఎవరో ఒక సలహాదారు సలహా ఇస్తారు. దాన్ని జగనన్న రాత్రికి రాత్రే ఒక జీవో తెచ్చి అమలు చేసేస్తారు.

దీనితో ఇన్నేళ్ళుగా హైద్రాబాద్ ను అంటిపెట్టుకుని ఉన్న ఐటీ పరిశ్రమలు రెక్కలొచ్చిన పక్షుల మాదిరి ఎగిరిపోతాయి. రోడ్లన్నీ ఖాళీ అవుతాయి. ట్రాఫిక్ సమస్యలు తీరిపోతాయి. రోడ్ల మధ్యలో అడ్డంగా వేసిన వేసిన మెట్రో పిల్లర్లను కూల్చేసి రోడ్లను విస్తరిస్తారు. ఇలా
ఒకేఒక్క నిర్ణయంతో జగన్ అద్భుతాలను సైతం ఆవిరి చెయ్యగలరు అని మరోసారి రుజువు చేసుకుంటారు.

అయితే ఇటువంటి నిర్ణయాలను కూడా వ్యవస్థల్లో జగనన్న తీసుకువచ్చిన సంస్కరణలే అంటూ ప్రచారం చేయడానికి నీలి మీడియా మైకు పట్టుకుని సిద్ధంగా ఉంటడం ఇక్కడి కొస మెరుపు. మరి తెలంగాణ ప్రజలతో పాటుగా హైద్రాబాద్ వాసులు కూడా ఒక్కసారి వైసీపీకి, జగన్ కు ఛాన్స్ ఇచ్చి జగన్ బుర్రలో ఉన్న ఆలీబాబా అద్భుత దీపం మహిమలు, సలహాదారుల సలహాలు రుచి చుడడానికి సిద్ధమా.?