గురువారం ఉదయం 9 గంటల నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ ఎప్పటిలాగే జగన్‌కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప రానని తెగేసి చెప్పిన ఈసారి కూడా మొహం చాటేశారు.
జగన్, ఎమ్మెల్యేలు శాసనసభకు రానప్పుడు ఎమ్మెల్సీలను మండలి సమావేశాలకు ఎందుకు పంపిస్తున్నారో, తాడేపల్లి ప్యాలస్‌లో వైసీపీ ఎల్పీ మీటింగ్ దేనికి నిర్వహిస్తున్నారో ఆయనకే తెలియాలి.
ఈ ప్రభుత్వం పని తీరు బాగోలేదు. ఏడాది పాలనలోనే రాష్ట్రంలో అన్ని రంగాలు భ్రష్టు పట్టించేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. మహిళలకు భద్రత లేకుండా పోయింది. సంక్షేమ పధకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ జగన్, వైసీపీ నేతలు, వారి సొంత మీడియా ప్రతీరోజూ గొంతు చించుకొని విమర్శలు గుప్పిస్తుంటారు.
రాష్ట్ర పరిస్థితి ఇంత అధ్వానంగా ఉందని వాదిస్తున్నప్పుడు శాసనసభ సమావేశాలకు హాజరయ్యి సిఎం చంద్రబాబు నాయుడుని, మంత్రులను గట్టిగా నిలదీయవచ్చు కదా?శాసనసభ వేదికగా కూటమి ప్రభుత్వ అసమర్ధతని, వైఫల్యాలను ఎండగట్టవచ్చు కదా?
కానీ జగన్ ఎప్పటిలాగే తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని టీవీలో శాసనసభ సమావేశాలను చూసి, తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి రన్నింగ్ కామెంటరీ ఇస్తుంటారు. ఆయనకు ఓ సొంత మీడియా ఉంది కనుక ఈ డ్రామాలు చేయగలుగుతున్నారు. ఒకవేళ లేకుంటే?అప్పుడూ ఇలాగే ఇంట్లో కూర్చోగలిగేవారా?
తాను సింగిల్ సింహం వంటివాడినని, యుద్ధానికి సిద్దం అంటూ జగన్ ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలికి ఎన్నికలలో ఓడిపోయారు. కానీ నేటికీ ఆ ప్రగల్భాలు మానుకోలేదు. నేటికీ సింహం శాసనసభకు వచ్చేందుకు భయపడుతూనే ఉంది. ఇలాంటి నాయకుడిని నమ్ముకున్న వైసీపీలు మళ్ళీ అధికారంలోకి వస్తామనుకోవడం అజ్ఞానమనుకోవాలా… గుడ్డి నమ్మకమనుకోవాలా? కానీ జగన్ తీరు ఇలా ఉన్నంత కాలం కూటమి ప్రభుత్వానికి డోకా ఉండదు.




