కబుర్లతోనే జగన్‌ 5 ఏళ్ళు కాలక్షేపం కానీ చంద్రబాబు…

Jagan Spent 5 Years With Chatter but Chandrababu Naidu...

జగన్మోహన్‌ రెడ్డి ఏపీని 5 ఏళ్ళు పూర్తిగా పాలించారు. ‘విశాఖ రాజధాని’ అయితేనే ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధి చెందుతాయని వాదిస్తూ 5 ఏళ్ళు ఆ కబుర్లతోనే కాలక్షేపం చేశారే తప్ప విశాఖ నగర అభివృద్ధికి చిన్న ప్రయత్నం కూడా చేయలేదు.

ADVERTISEMENT

కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే విశాఖ నగరానికి వచ్చి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌, విశాఖ నగరం, ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

జగన్‌కు నిజంగా విశాఖని రాజధాని చేయాలనే చిత్తశుద్దే ఉండి ఉంటే ముందుగా రోడ్ల విస్తరణ, కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేసి ఉండాలి. కానీ ఋషికొండని ధ్వంసం చేసి దానిపై రూ.500 కోట్లతో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు.

చంద్రబాబు నాయుడు తొలి పర్యటనలోనే నగరంలోని 12 ప్రధాన జంక్షన్లలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విశాఖ నగరానికి ప్రధాన పర్యాక ఆకర్షణ కేంద్రంగా అందమైన సముద్రతీరం ఉంది. కానీ జగన్‌ ప్రభుత్వం దానినీ పట్టించుకోలేదు.

కానీ చంద్రబాబు నాయుడు నిన్న తొలి సమీక్షా సమావేశంలో విశాఖ నుంచి భోగాపురం మీదుగా శ్రీకాకుళం వరకు ‘బీచ్ కారిడార్’ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు తన ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారని కనుక తమ ప్రభుత్వం చాలా వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలనుకుంటోందని, కనుక అధికారులు కూడా ఆ వేగానికి తగ్గట్లుగా చురుకుగా పనులు చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

అధికారులు తమ పనితనం, సామర్ధ్యం నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశామని కనుక ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

జగన్మోహన్‌ రెడ్డిలాగా చంద్రబాబు నాయుడు విశాఖని రాజధాని చేస్తామని చెప్పలేదు. కానీ నెలరోజులు కూడా కాక ముందే అప్పుడే విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పనులను మొదలుపెట్టేశారు.

జగన్‌ కుర్చీలో నుంచి దిగిపోయే ముందు భోగాపురం విమానాశ్రయం, భావనపాడు తదితర పోర్టు పనులకు శంకుస్థాపనలు చేశారు. జగన్‌ మొదలుపెట్టిన పనులను చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేయలేదు. వాటి పనుల పురోగతిని పరిశీలించి వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

జగన్ వద్ద 23 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కాపాడేందుకు ప్రయత్నించలేదు. కానీ చంద్రబాబు నాయుడు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో మాట్లాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ పర్యటనకు రప్పించి దానిని కాపాడేందుకు అప్పుడే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు నెల రోజుల పాలన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే విదంగా సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ జగన్‌ 5 ఏళ్ళు పాలించినా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించడమే తప్ప చేసిన ‘మేలు’ ఏమీ కనపడదు.

ADVERTISEMENT
Latest Stories