2024 సార్వత్రిక ఎన్నికలను కురుక్షేత్రంలో పోలుస్తూ తానూ కూటమి అల్లిన పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి అభిమన్యుడిని కాదని అర్జనుడిని అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి పురాణాలను పక్కన పెట్టి ప్రవచనాలను వినిపిస్తున్నారు.
జగన్ దృష్టిలో అసలు కురుక్షేత్రంలో నెగ్గిందెవరు? ఓడిందెవరు? పురాణాల చరిత్ర ఆధారంగా చూస్తే ధర్మం (పాండవ సేన) గెలిచింది. అధర్మం (కౌరవ సేన) అంతమొందింది. 100 మంది కౌరవ సేనను ఓడించడానికి 5 గురు పాండవులు నడుంబిగించినట్టు 151 మంది ఎమ్మెల్యే లున్న వైసీపీ సేనను నివారించడానికి 3 పార్టీలు నడుం బిగించాయి.
ఈ కురుక్షేత్రంలో పొత్తు కుదుర్చుకున్న ఈ పార్టీల మధ్య ఎలా అయినా విద్వేషాలు రెచ్చకొట్టడానికి, విభేదాలు సృష్టించడానికి వైసీపీ తన సోషల్ మీడియాలో ‘ఫేక్ ప్రచారాలు’ అనే పద్మవ్యూహాన్ని రచించింది. అయినప్పటికీ వైసీపీ వేసిన వ్యూహంలో మూడు పార్టీల నేతలే కాదు క్యాడర్ కూడా చిక్కుకోలేదు. అంటే ఇక్కడ పద్మవ్యూహం పన్నింది వైసీపీ. అధర్మం చేసింది వైసీపీ.
వైసీపీ పన్నిన పద్మ వ్యూహంలో చిక్కుకుని అభిమన్యుడు మాదిరి మూడు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకుని ప్రాణాలు కోల్పోవాలని ఆశించిన జగన్ ఆలోచనలకు బాబు, పవన్ ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకుంటూ వచ్చి మూడు పార్టీల క్యాడర్ ను సమన్వయపరిచారు. ఒక మహిళకు జరిగిన అవమానానికి ఆనాడు కురుక్షేత్ర యుద్ధం వేదికైతే ఒక రాష్ట్రానికి జరిగిన విధ్వంసానికి నేటి కురుక్షేత్రం వేదికయ్యింది.
పాపం చేసారు…ప్రక్షాళన తప్పదు అంటూ నాటి కౌరవధను దగ్గరుండి నడిపించారు శ్రీ కృష్ణుడు, అలాగే తప్పు చేసాం…పరిహారం చేస్తాం అంటూ తమ ఓటు అనే వ్యూహంతో నాటి వైసీపీ వధను దగ్గరుండి పూర్తి చేసారు ఏపీ ప్రజానీకం. నాడు అధర్మం జరిగింది కాబట్టే ధర్మం గెలిచింది. నేడు వైసీపీ హయాంలో రాష్ట్రానికి అధర్మం జరిగింది కాబట్టే కూటమి ప్రభుత్వానికి పట్టంకట్టి ధర్మం వైపు నిలబడ్డారు.
పురాణాల మీద తెలిసి తెలియని అవగాహనతో జగన్ తనముందున్న స్క్రిప్ట్ చదివి అసలు ప్రజలకు ఏది ధర్మం? ఏది అధర్మం? ఇప్పుడు తమ కర్తవ్యం ఏమిటి అనేది జ్ఞప్తికి తెచ్చినట్టున్నారు. జగన్ దృష్టిలో ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న తేడా “అ” ఒక్కటే కావచ్చు కానీ ఆ ఒక్క అక్షరం ఆ నాటి కురుక్షేత్రంలో, ఈ నాటి రాజకీయ యుద్ధంలో కొన్ని కోట్ల ప్రజల ప్రాణాలను బలిచేసింది.
అప్పుడు రక్తంతో తడిచిన నెల ఇప్పుడు కన్నీటితో తడిచింది. అప్పుడు పాండవులకు అండగా కృష్ణుడు ముందుండి చక్రం తిప్పితే ఇప్పుడు కూటమికి అండగా తెర వెనుక చక్రం తిప్పారు ప్రజలు. రాజ్యం మీద ఆశతో కౌరవులు ఆ దుస్సాహసానికి ఒడిగడితే అధికారం మీద అత్యాశతో జగన్ తన విధ్వంసానికి అంకురార్పణ చేసారు. ఒక్క విజయంతో వచ్చిన బలుపు ఒక్క ఓటమితో ఆవిరైపోయింది.
ఇప్పటికైనా జగన్ కు కురుక్షేత్రంలో గెలిచిందెవరో? ఓడిందెవరో? అర్దమయ్యిందో లేదో. అలాగే ఈ ఎన్నికల్లో పాండవులు, ఎవరు కౌరవులు ఎవరు అనేది జగన్ గ్రహించినట్టేనా? గెలవాడిని పురాణాలను రాజకీయ వేదిక మీదకు తెచ్చిన జగన్ ఓడిపోయాక మళ్ళీ మా టైం వస్తుంది అప్పటి వరకు కళ్ళు మూసుకుని అజ్ఞాతవాసం చేయండి అంటూ పార్టీ క్యాడర్ కు లీడర్లకు ప్రవచనాలు వల్లెవేస్తున్నారు.




