శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ప్యాలస్‌లోనే కాలక్షేపం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నేడు తొలిసారిగా బయటకు వచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో తమ పార్టీ కార్యకర్త షేక్ జిలానీ చేతిలో హత్యకు గురైన మరో కార్యకర్త షేక్ రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించే పేరుతో తాడేపల్లి ప్యాలస్ నుంచి బయలుదేరారు.
జగన్ కొద్ది మంది అనుచరులతో షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తే అభ్యంతరం లేదు కానీ వేలాదిమందితో ఊరేగింపుగా రావద్దని జిల్లా ఎస్పీ ముందే సూచించారు. ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, కనుక శాంతి భద్రతలకు భంగం కలగకుండా జగన్ పరామర్శ చేసుకొని వెళ్ళవచ్చని చెప్పారు.
పార్టీ కార్యకర్త చనిపోతే పరామర్శించడం తప్పు కాదు. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని గత కొన్ని రోజులుగా వైసీపి దుష్ప్రచారం చేస్తున్నందున, అది మరోసారి నొక్కి చెప్పేందుకే పరామర్శ పేరుతో జగన్ వినుకొండ బయటలుదేరారు తప్ప రషీద్ కుటుంబంపై ప్రేమ, అభిమానంతో కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకే దర్శనం ఇవ్వని జగన్‌కి ఇప్పుడు ఓ సామాన్య కార్యకర్త మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటే నమ్మశఖ్యంగా ఉందా?
కనుక జగన్ ఓదార్పు పేరుతో శవరాజకీయాలు చేయడానికే బయలుదేరారని చెప్పక తప్పదు. ఆయన పర్యటన వెనుక దురుదేశ్యం అర్దమవుతోంది కనుకనే జగన్ వెనుక బయలుదేరిన వైసీపి సైన్యాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అమరావతి రైతులను తాము పోలీసులతో అడ్డుకున్నామనే సంగతి మరిచినవైసీపీ నేతలు, చంద్రబాబు నాయుడు పోలీసులతో జగన్ కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని, ఆయనకు భద్రతని తగ్గించేశారని అప్పుడే ఆరోపణలు చేస్తున్నారు.
వైసీపి కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటుంటే అందుకు జగన్ బాధ్యత వహించాల్సి ఉండగా, శాంతి భద్రతలు క్షీణించాయంటూ దానికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం శవరాజకీయాలే కదా?




