జగన్ పాలనలో ఒక్కో రంగం ఒక్కో విదంగా పీడించబడ్డాయి. అందరికీ వినోదం అందించే సినీ పరిశ్రమని కూడా జగన్ కంట తడిపెట్టించారు. సినీ పరిశ్రమ పెద్దలు చేతులు జోడించి వేడుకుంటే జగన్ ఏదో ఘనవిజయం సాధించిన్నట్లు పైశాచికానందం పొందారే తప్ప మన పద్మశ్రీలు, మన పద్మ విభూషణ్‌లను అవమానిస్తున్నానని అనుకోలేదు.
సినీ నియంత్రణ చట్టం పేరుతో సినీ పరిశ్రమని ఎంతగా వేదించారో అందరూ కళ్ళారా చూశారు. ఒకపక్క వారిని అవమానిస్తూ ఏపీకి సినీ పరిశ్రమ తరలిరావాలని జగన్ కోరడం చాలా విచిత్రంగానే ఉంటుంది. కానీ గమ్మతైన విషయం ఏమిటంటే, అప్పుడు ముఖ్యమంత్రి జగన్ పిలిస్తే పట్టించుకోని సినీ పరిశ్రమ, ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ లేఖ వ్రాస్తే వెంటనే స్పందించింది!
ఏపీలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి అందరూ కలిసి రావాలంటూ మంత్రి కందుల దుర్గేష్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఇటీవల ఓ లేఖ వ్రాశారు. ఏపీలో సినీ స్టూడియోలు వగైరా ఏర్పాటుకు, సినిమా షూటింగ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు అందిస్తుందని, కనుక ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని మంత్రి కందుల దుర్గేష్ విజ్ఞప్తి చేశారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెంటనే స్పందిస్తూ త్వరలోనే ఎపెక్స్ కమిటీ వచ్చి మిమ్మల్ని కలుస్తుందని, ఏపీలో సినీపరిశ్రమ అభివృద్ధికి గల అవకాశాలు, చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుదామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ వ్రాసింది.
రాష్ట్ర విభజన ఉద్యమాల సమయంలో కేసీఆర్ తెలుగు సినీ పరిశ్రమపై కత్తులు దూసేవారు. కానీ అధికారంలోకి వచ్చాక సినీ పరిశ్రమ తెలంగాణ రాష్ట్రానికి భారీగా ఆదాయం, అనేక వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి పేరు ప్రతిష్టలు కల్పించే కామధేనువు వంటిదని గ్రహించి అక్కున చేర్చుకొని ఆదరించారు.
కేసీఆర్‌కి అర్ధమైన ఈ విషయం జగన్‌కు అర్దం కాకపోవడం వలననే సినీ పరిశ్రమని కూడా రాజకీయ కోణంలో నుంచే చూస్తూ దాని ఆర్ధిక మూలాలను దెబ్బ తీయాలని ప్రయత్నించారు. తద్వారా టిడిపికి నష్టం కలిగించవచ్చనుకున్నారు. కానీ ఆ దురాలోచనే బెడిసి కొట్టింది.
జగన్ చేతిలో ఎన్నో అవమానాలు భరించిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బాలకృష్ణ మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. జనసేనకు చెందిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు. ఇప్పుడు వారు తెలుగు సినీ పరిశ్రమకు రాచమర్యాదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాగతం పలుకుతున్నారు. అందుకే సినీ పరిశ్రమ కూడా సానుకూలంగా స్పందించింది.




