నేడు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే ఊహించిన్నట్లే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఆమె మ్యాచ్ ఆడక తప్పని పరిస్థితి కల్పించినందున జగన్మోహన్ రెడ్డి టీమ్ కూడా బరిలో దిగి ఆమెను ధీటుగానే ఎదుర్కోవడం ఖాయం.
అయితే ఆమెకు ఎక్కువ టైమ్ లేదు కనుక వీలైనంత త్వరగా ఈ హిట్ ఇంకా పెంచకతప్పదు. కనుక రేపటి నుంచి మరింత ఉదృతంగా ఆమె కూడా ఎదురుదాడి చేయవచ్చు.
ముఖ్యమంత్రి సొంత చెల్లెలే తమని అవినీతిపరులు, అసమర్ధ ప్రభుత్వం అని విమర్శిస్తుంటే, ఇన్నేళ్ళుగా అప్పులు తెచ్చి సంక్షేమ పధకాలతో కొనుకొన్న ఓటు బ్యాంక్ నమ్మకం సడలిపోతుంది. పార్టీ నేతలు కూడా జారిపోయే ప్రమాదం ఉంటుంది.
కనుక జగన్ టీమ్‌లో డిఫెన్స్ ప్లేయర్స్ అంటే సజ్జల రామకృష్ణా రెడ్డి, అంబటి రాంబాబు, రోజా ఆమె నేతృత్వంలో మిగిలిన మహిళా మంత్రులు కూడా రంగంలో దిగిపోయి ఆమెపై ఎదురుదాడి చేయడం ఖాయమే.
ఈ పోరాటాలతో ఏపీ ప్రజలకు ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ చెల్లించనవసరం లేకుండా బోలెడంతా వినోదం లభించబోతోంది. అలాగే టిడిపి, జనసేనలకు బోలెడన్ని కొత్త కొత్త అస్త్రాలు లభించవచ్చు. మీడియా ప్రతినిధులకు కూడా ప్రతీరోజు న్యూస్ కోసం వెతుక్కోనవసరం లేకుండా అన్నాచెల్లెలు, వారి పార్టీలు బోలెడంత ‘స్టఫ్’ అందిస్తుంటాయి. అంతేకాదు.. ఇంతకాలం ఎవరికీ తెలియని వైఎస్ రాజకోట రహస్యాలు కూడా తెలియవచ్చు.
ఇవన్నీ నాణేనికి బొమ్మ అనుకుంటే, బొరుసు కూడా ఉంది. ఒకవేళ అన్నా చెల్లెలు, వారి పార్టీలు ఈ రాజకీయ డ్రామాని బాగా రక్తి కట్టిస్తే నష్టపోయేది ఎవరు?అని ఆలోచిస్తే టిడిపి, జనసేనలే అని చెప్పవచ్చు.
తెలంగాణలో బీజేపీ-బిఆర్ఎస్ పార్టీలు ఇలాగే యుద్ధాలు చేసుకొంటూ కొన్నేళ్లపాటు కాంగ్రెస్ పార్టీని సైడ్ చేసేశాయి. ఆ తర్వాత కాంగ్రెస్-బిఆర్ఎస్ పార్టీలు యుద్ధం మొదలవగానే బీజేపీ సైడ్ అయిపోయింది.
అలాగే ఏపీలో ‘వైఎస్ వెర్సస్ వైఎస్’ మద్య జరుగబోయే ఈ యుద్దాలతో రాష్ట్ర రాజకీయాలను కాంగ్రెస్, వైసీపిలు హైజాక్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే టిడిపి, జనసేనల విమర్శలు మసాలా లేని కోడికూరలా ప్రజలకు అనిపించవచ్చు.
అప్పుడు ఏపీ ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అని అయోమయానికి గురైతే, శాసనసభ ఎన్నికలలో హంగ్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది కూడా. ఇప్పటికే ఏపీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకవేళ షర్మిల ఎంట్రీ కారణంగా హంగ్ ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుక్కలు చించిన విస్తరిలా మారే ప్రమాదం ఉంది. కనుక ఏపీ ప్రజలు, టిడిపి, జనసేనలు తస్మాత్ జాగ్రత్త!




