ఆంధ్రప్రదేశ్‌లో చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ పక్క వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సులు వేసుకొని ఊరూరూ తిరుగుతూ సభలు నిర్వహిస్తున్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు సభలలో ‘నా బీసీలు, నా ఎస్సీ, నా ఎస్టీలు, నా మైనార్టీలు…’ అంటూ కూనిరాగం తీయడం మరిచిపోరు.
మరోపక్క రాష్ట్రంలో బీసీలు, దళితులు, మైనార్టీల మీద నిత్యం ఎక్కడో అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల గురించి మీడియాలో వార్తలు వస్తునే ఉన్నాయి. కనుక ఇటువంటి ఘటనలు సిఎం దృష్టికి వెళ్ళలేదని అనుకోలేము. వైసీపి శ్రేణులు పట్టపగలే దాడులు చేస్తుంటే వాటిని సిఎం జగన్ ఖండించరు. కనీసం స్పందించరు! అయినా నా బీసీ, ఎస్సీ, ఎస్టీలంటూ కూనిరాగం తీయడం ద్వంద వైఖరే అనుకోవాలి.
‘సామాజిక సాధికార యాత్ర’ అంటే సమాజంలో అన్ని కులమతాలకు వైసీపి ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని చాటింపు వేసుకోవడమే. అందుకే ఈ యాత్రలలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను బస్సులు ఎక్కించి తిప్పిస్తున్నారు.
పార్టీలో ఆయా వర్గాలకు చెందిన కొందరు నేతలకు పదవులిచ్చినంత మాత్రన్న రాష్ట్రంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు రక్షణ, గౌరవం, ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నట్లయితే ఈ సామాజిక సాధికార యాత్రలకు అర్దం ఉండేది. కానీ ఓ పక్క బీసీలు, దళితులపై నిత్యం దాడులు జరుగుతుంటే సామాజిక సాధికార యాత్రలు చేస్తుండటం వారిని అపహాస్యం చేస్తున్నట్లే కదా?
గురువారం డా.అంబేడ్కర్ కోనసీమ జిలా కొత్తపేటలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు దళిత మంత్రి విశ్వరూప్‌తో సహా దళిత ఎమ్మెల్యేలందరూ అందుకే మొహం చాటేశారు. దళితులపై దాడులు జరుగుతుంటే వారికి చాలా మేలు చేస్తున్నామని ఏవిదంగా చెప్పుకోగలమని మంత్రి విశ్వరూప్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ దాడులను తక్షణం కట్టడి చేయాలని మంత్రి విశ్వరూప్ కోరుతున్నారు. ఇదే విదంగా దళితులపై దాడులు జరుగుతుంటే రేపు ఎన్నికలలో వారిని ఓట్లు అడగలేమని హెచ్చరిస్తున్నారు. మరి సొంత పార్టీకే చెందిన దళిత మంత్రి మాటలు వైసీపి అధిష్టానం చెవికి ఎక్కించుకొంటుందో లేదో?




