వైసీపిలో మళ్ళీ ఎందరికి టికెట్లు?

YS_Jagan_YSRCP_Ministers_MLAఇప్పటి వరకు జగన్మోహన్‌ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సమీక్షా సమావేశాల ప్రకారం సుమారు 30-40 మంది పనితీరు బాగోలేదని వారికి మళ్ళీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదనే వార్తలు వచ్చాయి. వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి నలుగురు ఎమ్మెల్యేలను ముందే బయటకు పంపిచేశారు. కనుక పనితీరు బాగోలేదని తేల్చి చెప్పిన మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటో తెలీదు.

ADVERTISEMENT

తాజా సమాచారం ప్రకారం జగన్‌ కూడా ఈసారి కేసీఆర్‌ ఫార్ములానే ఫాలో అవ్వాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. బాగా ఇబ్బందికరంగా ఉన్న ఓ 10-15 మంది సిట్టింగులను మాత్రమే పక్కన పెట్టి మిగిలినవారికి మళ్ళీ టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మంది పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం జగన్‌కు తెలియదనుకోలేము. కానీ వారిలో చాలా మంది సొంత బలంతోనే ఎన్నికలలో గెలవగల సమర్ధులు. కనుక వారి గురించి ప్రజలు ఏమనుకొంటున్నారనే దానికంటే, గెలుపు గుర్రాలైన వారిని నమ్ముకోవడమే మేలని జగన్‌ భావించడం సహజమే.

ఒకవేళ జగన్‌ 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 120-130 మందికి మళ్ళీ టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళిన్నట్లయితే వారిపట్ల ప్రజా వ్యతిరేకతను టిడిపి, జనసేనలు తమకు అనుకూలంగా మలుచుకోగలిగితే వాటికి విజయావకాశాలు పెరుగుతాయి.

వైసీపిలో పలువురు సీనియర్లు ఈసారి తాము పోటీ చేయబోమని తమకు బదులు తమ పుత్రరత్నాలకు ఆ సీట్లు కేటాయించాలని జగన్మోహన్‌ రెడ్డిని చాలా కాలంగా కోరుతున్నారు. వారికి టికెట్లు ఇస్తే వారిని గెలిపించుకొనే బాధ్యత తమదే అని సీనియర్లు చెపుతున్నందున జగన్‌ అంగీకరించిన్నట్లు తెలుస్తోంది.

అయితే సీనియర్ల స్థానంలో వారి పుత్రరత్నాలు బరిలో దిగితే టిడిపి, జనసేనలకు అక్కడా అవకాశం కల్పించిన్నట్లే భావించవచ్చు. కానీ సీనియర్లను పూర్తిగా వదులుకోవడం కంటే వారిని లోక్‌సభకు పంపించి, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారిలో కొందరిని పక్కన పెట్టబోయే సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో పోటీ చేయించే ఆలోచనలో జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా శాసనసభ, లోక్‌సభ రెండు ఎన్నికలలో కూడా మళ్ళీ పూర్తి మెజార్టీ సాధించవచ్చని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మార్గని భరత్, వంగా గీత, చింతా అనురాధలను ఈసారి శాసనసభకు పోటీ చేయించడం దాదాపు ఖాయం అయ్యింది. ఇంకా మిథున్ రెడ్డి వంటి కొందరు యువ ఎంపీలను ఈసారి శాసనసభకు పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గత రెండేళ్ళుగా జగన్‌ ‘వైనాట్ 175?’ అని అంటున్న సంగతి తెలిసిందే. కనుక ఆ లక్ష్యం సాధించేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఈ ప్రయోగానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. కనుక టిడిపి, జనసేనలు కూడా తదనుగుణంగా వ్యూహరచన చేసుకోవలసి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories