నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుంటే నేను అసెంబ్లీకి రాను అంటూ జగన్ పెడుతున్న పేచీ చూస్తే నాకు చాక్లెట్ ఇవ్వకుంటే స్కూల్ కి వెళ్ళను అంటూ చిన్నపిల్లాడు చేసే మారం గుర్తొస్తోంది.
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా జగన్ అసెంబ్లీకి వెళ్తారా అన్న ప్రశ్నకు జగన్ మరో ప్రశ్న నే తన సమాధానంగా చెప్పారు. తానూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సైతం అసెంబ్లీకి రాలేదని,
నాడు అసెంబ్లీ లో జరగని, వైసీపీ నేతలు చెయ్యని అవమానం తనకు ఎదురయ్యింది అంటూ ఏడ్చుకుంటూ నేను సీఎం అయినా తరువాతే అసెంబ్లీ కి వస్తానంటూ వెళ్లిపోయిన బాబు ఇప్పుడు తానూ తన హక్కుల కోసం అసెంబ్లీ ని బహిష్కరిస్తే దాన్ని తప్పుబడతారా.? అంటూ నాటి ఘటన ను నేటి సంఘటనతో పోల్చి చూస్తున్నారు.
దీని బట్టి చూస్తే జగన్ కు ఆత్మాభిమానానికి – అహంకారానికి, భావోద్వేగానికి – భయానికి తేడా తెలియదనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇలా ఆత్మాభిమానంతో, భావోద్వేగంతో అసెంబ్లీ గడప దాటిన నేతల చరిత్ర జగన్ తెలుసుకోలేదా.?
1989 తమిళనాడు అసెంబ్లీ లో జయలలిత కు జరిగిన అవమానానికి గాను ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై నేను సీఎం అయిన తరువాతేనే ఈ అసెంబ్లీలో కాలు పెడతా అంటూ సవాల్ చేసి 1991 లో తమిళనాడు సీఎంగా ప్రజల ఆశీస్సులు పొంది అవమానం జరిగిన చోటే అధికార పీఠం ఎక్కారు.
ఇక 1993 అప్పటి జమ్మలమడుగు అభ్యర్థి పి. శివారెడ్డిని ఆయన ప్రత్యర్థి వర్గం దారుణంగా హత్య చేసారు. అయితే అందుకు గాను అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, స్పీఎకర్ పోడియం ను చుట్టుముట్టి నిరశన తెలిపారు. అయితే నాటి నిరసన కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొనకపోయినా స్పీకర్ ఎన్టీఆర్ తో సహా టీడీపీ సభ్యులందరినీ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసారు.
అయితే ఇది తనకు జరిగిన అవమానంగా భావించిన ఎన్టీఆర్ అసెంబ్లీ ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి తిరిగి ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానంటూ ప్రతిజ్ఞ పూనారు. ఇక 1994 లో తిరిగి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎన్టీఆర్.
ఇక తాజా ఉదంతానికొస్తే 2021 చంద్రబాబు కి ఎదురైనా చేదు ఘటన. వైసీపీ ప్రభుత్వం హయాంలో సాక్ష్యాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ నేతలు నాటి ప్రతిపక్ష నేత బాబు ని కించపరుస్తూ, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని అవమానిస్తూ నీచ విమర్శలు చేసారు.
దానికి మానసికంగా కుంగిపోయిన బాబు సభలో తనకు, తన భార్యకు జరిగిన అవమానికి భావోద్వేగానికి గురై ఇటువంటి కౌరవ సభలో నేను ఉండను, తిరిగి ముఖ్యమంత్రి అయిన తరువాతనే సభలో అడుగు పెడతాను అంటూ అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు.
అయితే ఇక్కడ బాబు తనకు జరిగిన అవమానానికి ప్రతిచర్యగా కేవలం తానూ మాత్రమే అసెంబ్లీకి దూరమయ్యారు కానీ తన పార్టీ ఎమ్మెల్యే లను దూరం చెయ్యలేదు. కానీ ఇక్కడ జగన్ విషయంలో ఇటువంటి అవమానాలేమి ఎదురుకాలేదు, కేవలం గత ఐదేళ్ల వైసీపీ వికృత్యాలే జగన్ ను, అతని 11 మంది సైన్యాన్ని అసెంబ్లీ లోపలి అడుగు పెట్టనివ్వడం లేదు.
అక్కడ గత పాలకుల సవాళ్ల వెనుక బలమైన కారణాలున్నాయి, అలాగే నాటి నేతల అవమానాల వెనుక తీవ్ర భావోద్వేగాలు దాగున్నాయి. ఇవన్నీ కలిపి వారిని ప్రజా నాయకులుగా మార్చాయి.
అయితే ఇక్కడ కేవలం వైసీపీ వితండవాదం, జగన్ మొండి పట్టుదల తప్ప మరో కారణం కనిపించడం లేదు. మరి అసెంబ్లీ బహిష్కరణ అంటూ వైసీపీ అనుసరిస్తున్న వైఖరి పట్ల, జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజామోదం ఉంటుందా.? వారు ఇటువంటి అహంకారా పూరిత చర్యలను హర్షిస్తారా.? అనేది చూడాలి.





