జగన్‌ ప్లాన్ మళ్ళీ బెడిసికొట్టిందే!

Jagan’s Plan Is Messed Up Again!

కేసీఆర్‌ మౌనంగా ఉంటే అది కూడా వ్యూహాత్మకమే అని బిఆర్ఎస్ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటారు. అదేవిదంగా జగన్‌ తుమ్మినా, దగ్గినా వ్యూహాత్మకమే అని వైసీపి నేతలు గొప్పగా చెప్పుకుంటారు.

ADVERTISEMENT

తుమ్మినా దగ్గినా వ్యూహాత్మకంగా ఉందో లేదో చూసుకునే జగన్‌, ఢిల్లీలో ధర్నా కూడా వ్యూహాత్మకంగానే చేశారు. ఏనుగు దంతాల్లా పైకి కనబడేవి, లోన నమిలి తినేవి వేరే ఉన్నట్లే జగన్‌ ఢిల్లీ ధర్నాకు అసలు కారణాలు, ఇతర కారణాల గురించి ఇప్పటికే చెప్పుకున్నాము.

అయితే జగన్‌ చాలా ఆలోచించి వ్యూహాత్మకంగా ధర్నా చేశారు కానీ అది బెడిసికొట్టిన్నట్లు కనిపిస్తోంది. అసలు ఈ సాకుతో ఢిల్లీలో ధర్నా చేయడమే పొరపాటు. మళ్ళీ దానికి కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలో పార్టీలను ధర్నాకు ఆహ్వానించడం ఇంకా పొరపాటు.

దీంతో ఆయన ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నట్లు సంకేతాలు పంపిన్నట్లయ్యింది. కాంగ్రెస్‌ మిత్రపక్షాలలో రెండు మూడు పార్టీల నేతలు వచ్చి జగన్‌కు సంఘీభావం తెలిపి ఇండియా కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానించిన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో రాజకీయాల కోసం జగన్‌ ఢిల్లీలో ధర్నా చేస్తే, దాంతో కాంగ్రెస్‌తో చేతులు కలపాలని తెర వెనుక చేస్తున్న ప్రయత్నాలు బయటపడ్డాయి.

ఒకవేళ జగన్‌ కాంగ్రెస్‌లో చేరాలనే ఆలోచన చేస్తున్నట్లయితే దాంతో బేరసారాలు చేయకుండా గుడ్డిగా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయలేరు. దానికి కొంత సమయం పడుతుంది. జగన్‌ అసలు ఇలాంటి ఆలోచన చేసి ఉండకపోవచ్చు కూడా.

కానీ కాంగ్రెస్‌ మిత్ర పక్షాలతో కలిసి ఫోటోలు దిగారు కనుక మోడీకి తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. ఇది ఆయనకు ఆగ్రహం కలిగిస్తే మళ్ళీ అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసుల విచారణ వేగం పుంజుకోవచ్చు.

ఢిల్లీ ధర్నాలో కాంగ్రెస్‌ మిత్రపక్షాలను ఆహ్వానించి జగన్‌ చేజేతులా మరో కొత్త సమస్య తెచ్చిపెట్టుకున్నారు. ఆయన పిలవగానే కాంగ్రెస్‌ మిత్రపక్షాలు వచ్చి సంఘీభావం తెలిపాయి. కనుక అవి పార్లమెంట్‌లో మోడీని వ్యతిరేకిస్తున్నప్పుడు, జగన్‌ కూడా వాటికి వంతపాడాల్సి ఉంటుంది.

కాదని మళ్ళీ మోడీ పక్కన చేరితే అవి ఇకపై ఎన్నడూ జగన్‌కు మద్దతు ఈయవు. అయితే కాంగ్రెస్‌ మిత్రపక్షాల నేతలతో ఫోటోలు దిగినప్పుడే జగన్‌పై మోడీకి నమ్మకం సడలి, అనుమానం, కోపం కలిగి ఉండవచ్చు. కనుక ఒకవేళ జగన్‌ మళ్ళీ తమ పంచన చేరాలనుకున్నా మోడీ, అమిత్ షాలు ఆయన నమ్మరు. దరి చేరనీయక పోవచ్చు. కనుక జగన్‌ ఎంతో ఆలోచించి వ్యూహాత్మకంగా ఢిల్లీలో చేసిన ధర్నా బెడిసికొట్టిన్నట్లే ఉంది.

ADVERTISEMENT
Latest Stories