ఏముంది బూడిదేగా… అని తేలికగా తీసి పడేయడానికి ఇది కట్టెలపొయ్యిలో మిగిలిన బూడిద కాదు. కడప జిల్లా రాయలసీమ ధర్మల్ పవర్ స్టేషన్ (ఆర్‌టీపిపి) నుంచి వచ్చే ఫ్లై యాష్! రోజుకి సుమారు 4,000 టన్నుల బూడిద వస్తుంటుంది.

Also Read – మేము రోడ్లపై జగన్‌ ప్యాలస్‌లోనా.. ఎందుకు ?

ఆ బూడిద సిమెంట్ ఇటుకల తయారీ తదితర పరిశ్రమలకు ముడిసరుకు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు దానిని తరలించుకుపోయేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. కనుక వారు దాని వైపు చూసేందుకు కూడా అవకాశం లేదు.

ఇప్పుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆ బూడిద కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరూ మాట్లాడుకొని తీసుకువెళితే దీని గురించి మీడియాలో కూడా వార్త కనిపించేది కాదు.

Also Read – జగన్‌ చివరి ఆశ అదే?

కానీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బూడిద మొత్తం తనకే కావాలనుకోవడంతో ఇద్దరి మద్య వివాదం మొదలై, బహిరంగంగా సవాళ్ళు చేసుకునే స్థాయికి చేరుకుంది. ప్లాంట్ వద్ద ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకునే పరిస్థితి నెలకొనడంతో అక్కడ పోలీసులను మోహరించాల్సి వచ్చింది కూడా.

అప్పటి నుంచే ఈ వ్యవహారం గురించి మీడియాలో కధనాలు మొదలయ్యాయి. ఇంతకాలం బూడిద పంచుకున్న వైసీపీ నేతలు కూడా ఇప్పుడు వారిని వేలెత్తి చూపుతూ టీడీపీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

Also Read – రాజధాని రైతులని వేధించి ఇప్పుడు మొసలి కన్నీళ్ళా?

ఈ వ్యవహారం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి రావడంతో ‘ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించబోనని’ ఇద్దరినీ ఫోన్లో మందలించారు.

వైసీపీ నేతలు చేసిన తప్పులను ఎండగట్టి వారి పార్టీని ఎన్నికలలో ఓడించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. కనుక టీడీపీ నేతలు కూడా అటువంటి తప్పులు చేయకూడదని ప్రజలు, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఆశించడం సహజం.

కానీ ఇద్దరు సీనియర్ నేతల అనుచరులు బూడిద కోసం రోడ్లపై కొట్టుకొని ప్రభుత్వం పరువు తీస్తుండటంతో చాలా పొరపాటు. ముఖ్యమంత్రి ఫోన్ చేసి హెచ్చరించినా ఇద్దరూ వెనక్కు తగ్గకపోవడం ఇంకా పెద్ద పొరపాటు. కనుక ఇద్దరూ నేడు అమరావతికి వచ్చి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని కలవాలని సీఎంవో నుంచి పిలుపులు వెళ్ళాయి. ముఖ్యమంత్రి ఇద్దరికీ అక్షింతలు వేసి పంపిస్తారని అర్దమవుతూనే ఉంది.




ఓకే పార్టీలో ఉన్న ఇద్దరు సీనియర్ నేతలు ఈవిదంగా కీచులాడుకుంటుంటే, కూటమిలో జనసేన, బీజేపి నేతలతో ఎలా సర్దుకుపోగలరు? వైసీపీ, టీడీపీ నేతలకి తేడా ఏమీ లేదా?అందరూ ఇంతేనా?అని ప్రజలు భావిస్తే టీడీపీ కూటమిని అధికారంలోకి తీసుకు రావడానికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి, ఇప్పుడు రాష్ట్రానికి ఓ బ్రాండ్ ఇమేజ్ సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కదా?