అగ్ర హీరోల అభిమానుల మధ్య అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు జరగటం మామూలు విషయమే. కానీ ఈ మధ్య ఆ గొడవు హత్యలు చేసే స్థాయికి చేరిపోయాయి. తాజాగా జరిగిన పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన కార్యకర్త ‘వినోద్ రాయల్’ హత్యే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఆదివారం కర్ణాటకలోని కోలార్ లో పవన్ అభిమానులు నిర్వహించిన ఒక సామాజిక కార్యక్రమంలో పవన్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య చెలరేగిన గొడవలో జరిగిన ఈ హత్య ప్రస్తుతం రాష్ట్ర సినీ, రాజకీయ రంగాలను కుదిపేస్తోంది.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో తిరుపతి బయలుదేరి వెళ్లారు. తిరుపతికి చేరుకోగానే పవన్ ముందుగా వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించి ఆ తరువాత పలు జిల్లా నుండి వచ్చే తన అభిమాన సంఘాలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ భేటీలో పవన్ తన అభిమానులకు గట్టిగానే క్లాస్ ఇస్తారట. గతంలో కూడా పలు సందర్భాల్లో అభిమానులను సమన్వయంగా ఉండాలని, తొందరపాటు తగదని హెచ్చరించిన పవన్ ఈసారి మాత్ర స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఈ విషయంపై ఎలా ముందుకెళ్లాలో తెలుపుతారట.



