జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కార్యక్రమాల పై ద్రుష్టి పెట్టిన ఆనవాళ్లు అరుదే. ఈ నేపథ్యంలో ఈ నెల 28, 29, 30 మూడు రోజుల పాటు విశాఖ కేంద్రంగా ‘సేనతో సేనాని’ అనే పేరుతో జనసేన పార్టీ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు.
ఈ కార్యక్రమం తొలి రోజు పవన్ పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీ లు, ఎమ్మెల్సీ లతో సమావేశం కానున్నారు. పార్టీని క్షేత్ర సాయిలో బలోపేతం చేయడం, ప్రభుత్వ పని తీరు, ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు వంటి అంశాలు చర్చించనున్నారు.
ఇక మరుసటి రోజు సుమారు వివిధ విభాగాల యువతతో సమావేశమై రాజకీయాల్లో యువత పాత్ర, అభివృద్ధి మరియు ఉద్యోగాల కల్పనా వంటి ఇతరత్రా అంశాల మీద చర్చ జరగనుంది. జనసేనకు ఉన్న బలం, బలహీనత రెండు యువతే కావడంతో వారికీ పార్టీ అధిష్టానం నుంచి సరైన రాజకీయ గైడెన్స్ తప్పనిసరి.
ఇక చివరి రోజు బహిరంగ సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు. అయితే 2024 ఎన్నికలలో 100 % స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 కి 21 నెగ్గినప్పటికీ పార్టీ నాటి నుంచి నేటి వరకు అదే స్థాయిలో ఉండిపోయింది.
ఉప ముఖ్యమంత్రి నుంచి ఐదు శాఖల మంత్రిగా పవన్, పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ, క్షేత్ర స్థాయిలో జనసేన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది.
అటు సినిమాలు ఇటు పాలన అంటూ పవన్ పార్టీ కార్యక్రమాల పై శ్రద్ద పెట్టకపోవడం, క్షేత్ర స్థాయిలో పార్టీకి నాయకులను తయారు చెయ్యలేకపోయింది. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు జనసేన వన్ మాన్ షో మాదిరి వన్ అండ్ ఓన్లీ పవన్ అన్నట్టుగానే సాగుతుంది.
ఇదే జనసేనకు బలమైన నాయకత్వాన్ని దూరం చేస్తూ వస్తుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పని చేసే జనసేన అభిమానులు ఉన్నప్పటికీ ఆ అభిమాని, పార్టీ మీద ప్రేమను అధికారం వైపు తీసుకెళ్లే నాయకత్వం లేకపోవడం మొదటి నుంచి జనసేనను వెనక్కిలాగుతుంది.
అటు పార్టీలో నెంబర్ 2 గా భావించే నాదెండ్ల సైతం మంత్రి గా ఉండడంతో పార్టీ బలోపేతం పై పెద్దగా ద్రుష్టి సారించలేకపోతున్నారు. ఇక పవన్ అన్న నాగబాబు ఎమ్మెల్సీ గా ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాల విషయంలో అంత చురుకుగా వ్యవహరించకపోవడం, ఎక్కువగా హైద్రాబాద్ కే పరిమితం కావడం వంటి అంశాలు జనసేన బలోపేతం కాలేకపోవడానికి కారణాలుగా పేర్కొనవచ్చు.
ఏ పార్టీ మనుగడకైనా పార్టీ కార్యకర్తల నుంచి కింద స్థాయి, జిల్లా, ప్రాంత, రాష్ట్ర…ఇలా అంచలంచలుగా బలమైన నాయకత్వం ఉండాలి. అప్పుడే ఆ పార్టీ రాజకీయంగా బలపడుతుంది, ఎన్ని ఒడిదుడుకులనైనా తట్టుకోగలుగుతుంది. అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని రెండిటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లగల సమర్ధవంతమైన నాయకులు జనసేనకు అవసరం.
రాష్ట్రంలో జనసేన గెలిచిన స్థానాలలో సైతం పార్టీ పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల కనిపించకపోవడం ఆ పార్టీ అభిమానులను కలవర పెడుతుంది. ఎమ్మెల్యే లుగా, ఎంపీలుగా గెలిచిన జనసేన నాయకులు సైతం పార్టీ బలోపేతం పై ద్రుష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటూనే అటు పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పవన్ భరోసాగా నిలబడాలి.
పార్టీ అధికారంలో ఉన్న ఇటువంటి సానుకూల సమయంలోనే పార్టీ తనకు పట్టున్న ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేసుకోగల్గాలి, అలాగే ఇతర ప్రాంతాలలో సైతం పట్టు కోసం బలమైన నాయకులను తయారు చేసుకోగలగాలి. సభలకు వచ్చే జనసమూహం తో పవన్ కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమి లేదు.
అయితే ఆ సమూహాన్ని లక్ష్యం వైపు నడిపే నాయకులను పవన్ సిద్ధం చేసుకోవాలి. సభలు, సమావేశాలు అంటూ విశాఖలో జరగబోయే మూడు రోజుల కార్యక్రమలు జనసేనకు మూన్నాళ్ళ ముచ్చటగా కాకుండా రానున్న మూడేళ్ళ పార్టీ భవిష్యత్ గా మార్చగలగాలి.






