ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ర్యాలీలు చేయవచ్చు. అప్పుడు ఉండని సమస్యలన్నీ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల సభలు, సమావేశాలకు పుట్టుకొచ్చేస్తుంటాయి. ప్రతిపక్ష నేతలు ప్రజల మద్యకు వస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగిపోతుంది. కనుక వారి పర్యటనలపై ఆంక్షలు తప్పనిసరి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేసుకొంటే తమకు అభ్యంతరం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు చెపుతుంటారు. కానీ గురువారం నుంచి విశాఖలో పవన్ వారాహియాత్రకు పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షల జాబితా చూస్తే పవన్ కళ్యాణ్ వారాహిలో ఎవరికీ కనబడకుండా, ఎవరితో మాట్లాడకుండా విశాఖలో స్వేచ్ఛగా తిరిగి, వెళ్లిపోవచ్చని చెపుతున్నట్లుంది.
విమానాశ్రయం నుంచి ర్యాలీగా వెళ్ళకూడదట. వాహనంలో నుంచి అభిమానులకు, ప్రజలకు అభివాదం చేయకూడదట. పవన్ కళ్యాణ్ జగదాంబ జంక్షన్ వద్ద బహిరంగసభ నిర్వహించుకోవచ్చు కానీ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ చుట్టుపక్కల చుట్టుపక్కల భవనాలపైన నిలబడరాదు. నిలబడితే ఈ సభకు అనుమతిపొందినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఇంకా అనేక ఆంక్షలు విధించారు విశాఖ జిల్లా పోలీసులు. వాటిపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటనను శాంతిభద్రతల పేరుతో నియంత్రించేందుకు ఆంక్షలు విధించారు సరే. కానీ రేపు ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే ప్రశ్నలకు మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద జవాబు ఉంటుందా?అంటే ఉండదనే అందరికీ తెలుసు.
రాజకీయాలకు దూరంగా ఉండే చిరంజీవి వంటివారు కూడా ఏపీలో పెరుకుపోయిన సమస్యల గురించి మాట్లాడుతున్నారంటే దానిని రాజకీయకారణాలు చూపిస్తూ ఎదురుదాడి చేశారే తప్ప ఆయన అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు ఏ మంత్రి ధైర్యంగా సమాధానం చెప్పలేకపోయారు.
పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ వ్యవస్థలో అనేక లోపాలను, సమస్యలను ఎత్తిచూపి ప్రశ్నిస్తే, వైసీపీలో ఏ ఒక్కరూ వాటికి సూటిగా జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేశారు.
పవన్ కళ్యాణ్ రేపటి పర్యటనలో విశాఖలో వైసీపీ నేతల భూకబ్జాలు, దౌర్జన్యాల గురించి మాట్లాడుతానని ముందే చెప్పారు. కనుక బహుశః వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయేమో? కానీ ఎదురుదాడి చేయడం వైసీపీలో అందరికీ బాగా అబ్బింది కనుక రేపూ అదే చేస్తారు.
అయితే నిప్పులా రగులుతున్న అనేక సమస్యలపై వైసీపీ ప్రభుత్వం ఎంతకాలం గుడ్డకప్పి దాచిపుచ్చగలదు?తమ ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా అసహనంతో ఉన్నందునే వారు ప్రతిపక్ష నేతల సభలు, సమావేశాలకు భారీగా హాజరవుతున్నారని వైసీపీ నేతలు గ్రహించలేకపోతున్నారా లేక తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత వారి అసహనం రూపంలో బయటపెట్టుకొంటున్నారా?వారే ఆలోచించుకోవాలి.



