Janasena leaders protest against  hike in electricity chargesరాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా విపక్షాలన్ని పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలియచేస్తున్నారు. టీడీపీ లాంతర్లతో నిరసన తెలపగా., కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రం అందచేయాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జనసేన నాయకులు., కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చారు.

పెంచిన కరెంట్ చార్జీలు వెంటనే తగ్గించాలంటూ జనసైనికులు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీలు నిర్వహించారు. పరిపాలన మీద పట్టు లేదు., వ్యవస్థల మీద గౌరవం లేదు., డిపార్టుమెంట్స్ మీద పర్యవేక్షణ లేదు, చివరికి అధికారులను బలి చేస్తూ జగన్ రెడ్డి పబ్బం గడుపుతున్నారన్నారని జనసేన ముఖ్య కార్యదర్శి నాదెండ్ల మనోహర్ విమర్శల వర్షం కురిపించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘అధ్యక్షా..! ఈ రాష్ట్రంలో పేదవాడు ప్రశాంతంగా బతకకూడదా? ఈ బాదుడు కార్యక్రమాలతో ప్రభుత్వం పేదవాడి నడ్డి విరుస్తుంది’ అంటూ నీతులు చెప్పిన జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ‘పేదవాడి లేడనుకున్నాడా’? లేక మీ బాదుడు పథకంతో ‘ప్రజలందరినీ పేదలుగా మార్చాలనుకున్నాడా’? అంటూ గుంటూరు జనసేన నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు.

మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాభాలలో ఉన్న డిపార్ట్ మెంట్ ఇప్పుడు నష్టాలలోకి వచ్చిందంటే అది మీ అసమర్ధ పాలనకు., చేతకానితనానికి నిదర్శనం అంటూ రెచ్చిపోయారు జనసేన నేతలు. నష్టాలు వస్తే పెంచడానికి నీకు సీఎం పదవెందుకు., ఆ పని ఐఏస్ అధికారికిచ్చిన ప్రభుత్వాన్ని నడుపుతాడు అంటూ జగన్ ను ఎద్దేవా చేశారు.

పోతిన మహేష్ నేతృత్వంలో విజయవాడలో ‘విసినికర్రలతో’ వినూత్న ర్యాలీ చేశారు జనసైనికులు. ట్రూ అప్ చార్జీల పేరుతో ఇప్పటికే ప్రజల నెత్తిన మోయలేని భారం మోపారని “జగనన్నా విద్యుత్ షాక్” పధకాన్ని ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలకు అందించారని., అయితే జగన్ కు కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో “రిటన్ గిఫ్ట్” ఇస్తామని వైసీపీ ప్రభుత్వానికి జనసేన నాయకులు గట్టి హెచ్చరికలే పంపారు.

ప్రతిపక్షాల నిరసనలు., ఆందోళనలు.,ర్యాలీలతోను., అధికార పార్టీ అరెస్టులతో రాష్ట్రంలో వాతావరణం భానుడి తాపానికి మించి సెగలు రేపుతుంది. చూడాలి మరి విపక్ష నేతల నిరసనతో అయినా ప్రభుత్వంలో చలనం వచ్చి ప్రజలకు ఈ ‘బాదుడు పధకం’ నుండి ఉపశమనం దొరుకుతుందో లేదో!?