“ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తాము.. వారి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీలు గుప్పించారు. కానీ నేటికీ వారి సమస్యలు తీర్చనేలేదు పైగా ఇచ్చిన హామీలను కూడా ఇంతవరకు నెరవేర్చలేదని,” జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో, “జగన్ ప్రభుత్వం పోలీసులను తమ రాజకీయ కక్ష సాధింపులకి, అవసరాలకి బాగానే వాడుకొంటోంది కానీ వారు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టన్నట్లు వ్యవహరిస్తోంది. మేము అధికారంలోకి వస్తే వీక్లీ ఆఫ్ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు దానిని అమలుచేయడం లేదు. పోలీసులు నిత్యం డ్యూటీలో వివిద ప్రాంతాలకు తిరగవలసి ఉంటుంది. కనుక ప్రభుత్వం వారి ప్రయాణభత్యాల (టీఏ)ను ఎప్పటికప్పుడు చెల్లించాలి కానీ వైసీపీ ప్రభుత్వం గత 14 నెలలుగా వారి ప్రయాణ భత్యం చెల్లించడం లేదు?
పోలీసు ఉద్యోగాలు కాస్త రిస్కుతో కూడుకొన్నవని చెపుతూ వారి భద్రత కోసం నెల నెలా వారి జీతాలలో నుంచి కొంత సొమ్ము కోసుకొంటోంది ప్రభుత్వం. కానీ వారి అవసరాలకు దాని కోసం దరఖాస్తు చేసుకొంటే వాటిని ఇవ్వకుండా పెండింగులో పెట్టడం లేదా కుంటిసాకులతో తిరస్కరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాగే వారి సెలవుల తాలూకు సొమ్ము కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. వారి వద్ద కోసుకొన్న సొమ్ము దేనికి మళ్ళించారు?ఒకవేళ మళ్ళించకపోయుంటే వారి సొమ్ము వారికెందుకు ఇవ్వడం లేదు?
ఇటీవల నంద్యాలలో సురేంద్ర అనే ఓ పోలీస్ కానిస్టేబుల్ హత్య చేయబడ్డాడు. పోలీసుల ప్రాణాలకే భద్రత లేకపోతే ఇక వారు ప్రజల ప్రాణాలు ఎలా కాపాడగలరు? ఓ పోలీస్ కానిస్టేబుల్ హత్య చేయబడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. సురేంద్రను హత్య చేసినవారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు?” అని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇటువంటి ప్రశ్నలకు, విమర్శలు, ఆరోపణలకు వైసీపీ ప్రభుత్వం స్పందిస్తుందనుకోవడం అత్యాసే కదా?



