తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తి పరాయి స్త్రీలను గౌరవిస్తారా?

Pawan Kalyan Satire On YS Jaganజనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఈసారి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు తమకు అడ్డంగా దొరికిపోయాడని వైసీపీ నేతలు ఎగిరిగంతేశారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా దానిపై మరింత లోతుగా తన వాదనలు వినిపిస్తూ, మరింత తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే వైసీపీ నేతలు బిత్తరపోతున్నారు.

ADVERTISEMENT

సంక్షేమ పధకాలు, వాలంటీర్ వ్యవస్థలతో వచ్చే ఎన్నికలలో గట్టెక్కేయవచ్చనుకొన్న వైసీపీని దాని ఆయువుపట్టు మీదే పవన్‌ కళ్యాణ్‌ దెబ్బతీస్తున్నారు.

దీంతో ఒక్క పవన్‌ కళ్యాణ్‌ని నిలువరించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు మూకుమ్మడిగా ఎదురుదాడులు చేస్తున్నారు. వైసీపీ నేతలు మహిళా కమీషన్, వాలంటీర్లను, పోలీసులను కూడా ఈ యుద్ధంలోకి దించారు. మహిళా కమీషన్‌ చేత పవన్‌ కళ్యాణ్‌కు నోటీసులు ఇప్పించారు. వాలంటీర్ల చేత నిరసనలు చేయిస్తున్నారు. పోలీసుల చేత కేసులు పెట్టిస్తున్నారు.

అయినా పవన్‌ కళ్యాణ్‌ ఓ యుద్ధనౌకలాగా వైసీపీలోకి చొచ్చుకుపోతూనే ఉన్నారు. బుదవారం తాడేపల్లిగూడెం సభలో పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సిఎం జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్ వ్యవస్థపై తీర్వస్థాయిలో విరుచుకుపడ్డారు. “తన తల్లిని, సొంత చెల్లిని గౌరవించని వ్యక్తి పరాయి స్త్రీలను గౌరవిస్తారని ఎలా ఆశించగలము?రాజకీయాలతో సంబందం లేని నా భార్య గురించి కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నారు. అదీ… విద్యార్థులతో! అందుకే ఆయన అంటే నాకు గౌరవం పోయి ఏకవచనంలో సంభోదిస్తానని అన్నాను.

కానీ మేము ఏనాడైనా మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఈవిదంగా మాట్లాడామా?ఓసారి మీ భార్య భారతిగారినే డిగి తెలుసుకోండి. ఈ సభాముఖంగా ఆమెకు కూడా నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ భర్తని అదుపులో పెట్టుకోమని కోరుతున్నాను,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

“ఒక్క విషయం ఖచ్చితంగా చెపుతున్నాను. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఎట్టి పరిస్థితులలో జగన్‌ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు. ఇది 100 శాతం ఖాయంగా జరిగితీరుతుంది,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడుతూ, “ఏపీలో వాలంటీర్ల ద్వారా ప్రజలందరి వ్యక్తిగత సమాచారం సేకరించి హైదరాబాద్‌లో నానక్‌రామ్ గూడాలోని ఓ ప్రైవేట్ ఏజన్సీ చేతికి అందించిన మాట వాస్తవమా కాదా?దానిలో 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికీ ఎవరు జీతాలు చెల్లిస్తున్నారని నేను అడుగుతున్నాను.

మళ్ళీ మరోసారి ఈ సభాముఖంగా చెపుతున్నాను. వాలంటీర్లంటే నాకు కోపం, ద్వేషం లేదు. వారందరూ కూడా నా తోబుట్టువులు వంటివారే. అయితే వారు వైసీపీ చేతుల్లో చిక్కుకొని పావుల్లా మారిపోయి జీవితాలు నాశనం చేసుకొంటున్నారనే నేను బాధపడుతున్నాను.

వైసీపీ వాళ్ళకు నెలకు రూ.5,000 జీతం ఇస్తే పదివేలు ఇవ్వాలని కోరుకొనేవాడిని నేను. అసలు వాలంటీర్ అంటే ఎటువంటి జీతం, పారితోషికం ఆశించకుండా స్వచ్ఛందంగా ముందుకువచ్చి పనిచేసేవారిని వాలంటీర్ అంటారు. మన దేశంలో రెడ్ క్రాస్ వాలంటీరున్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రపటి, రాష్ట్రాల స్థాయిలో గవర్నర్లు వారికి అధిపతిగా వ్యవహరిస్తుంటారు. మరి ఏపీలోని ఈ వాలంటీర్ వ్యవస్థకి అధిపతి ఎవరు?వారికి నెలకు రూ.5,000 జీతం చెల్లిస్తూ వైసీపీకి ఊడిగం చేయించుకొంటున్న జగన్ ప్రభుత్వమే కదా?

వాలంటీర్లు అందరూ చెడ్డవాళ్ళని నేను అనడం లేదు. కానీ వారిలో కొందరు ఎర్రచందనం, మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. కొందరు మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు చేస్తూ పట్టుబడ్డారు. కొందరు సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని బెదిరిస్తూ ఒంటరి మహిళలను లొంగదీసుకొంటున్నారని విన్నాను.

కనుక ఇటువంటి వాలంటీర్ వ్యవస్థ మనకు అవసరమా? వాలంటీర్ వ్యవస్థ లేకమునుపు రాష్ట్రంలో ప్రజలకు రేషన్ సరుకులు అందలేదా? పింఛన్లు అందలేదా?” అంటూ పవన్‌ కళ్యాణ్‌ చాలా లోతుగా, నిశితంగా వాదనలు వినిపిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ADVERTISEMENT
Latest Stories