వచ్చే ఎన్నికలలో టిడిపి-జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నాయంటూ నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో వైసీపి షాక్ అయ్యింది. పైగా బీజేపీ తమతో కలిసివచ్చినా రాకపోయినా టిడిపితోనే కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇంతకాలం వైసీపి ఏమి జరగకూడదని భయపడుతోందో సరిగ్గా అదే జరిగింది.
ఆ రెండు పార్టీలు కలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ వాటికే పడతాయని వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వైసీపి పాలనలో అనేక అవమానాలు, దౌర్జన్యాలను ఎదుర్కొంటున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అవమానాలకు గురవుతున్న కమ్మ, కాపు, అమరావతి రైతులు అందరూ టిడిపి-జనసేనవైపుకు వచ్చేస్తారు. ఈ రెండు పార్టీల కలయికతో రాష్ట్రంలో ‘ఓట్ల పోలరైజేషన్’ జరుగుతుందనే భయంతోనే ఇంతకాలం వాటిని కలవకుండా అడ్డుకొనేందుకు వైసీపి ప్రయత్నించింది.
సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అవహేళన చేశారు. ఈసడించుకొన్నారు. చివరికి ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి కూడా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో వేయాలనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కారణంగానే టిడిపి-జనసేనల మద్య పొత్తులు ఖరారు కావడమే దేవుడి స్క్రిప్ట్ అనుకోవచ్చు.
ఇక మరో విషయం ఏమిటంటే వాటి పొత్తుల గురించి వైసీపి నేతలు ఇంతవరకు మాట్లాడకుండా సంయమనం పాటించి ఉంటే నేడు వారు ఏమి చెప్పినా ప్రజలు ఆసక్తిగా విని ఉండేవారు. కానీ వాటి గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నందున, వైసీపి నేతలకు ఇప్పుడు కొత్తగా చెప్పుకొనేందుకు, మాట్లాడేందుకు ఏమీ మిగలలేదు.
కనుక మళ్ళీ అందరూ పాత పాచి పాటనే అందుకొని కోరస్ పాడటం మొదలుపెట్టారు. అంటే వైసీపి కోయిలలు తొందరపడి ముందే కూసినందున ఇప్పుడు కొత్తగా కూయడానికి ఏమీ లేకుండాపోయిందన్న మాట. వారి ఈ పాచిపాటలు వినీ వినీ ప్రజలు కూడా విసుగెత్తిపోయున్నారు. కనుక ప్రజలకు కూడా ఇది వైసీపి ఆక్రోశంగా వినిపిస్తే ఆశ్చర్యం లేదు.