టిడిపి, జనసేనలకు ఈ త్యాగాలు అవసరమా?

Pawan-Kalyan-Janasena-Chandrababu-Naidu-TDP

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకే టిడిపి ఎన్నికలలో పోటీ చేయకుండా వెనక్కు తగ్గిందని బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ టిడిపికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయిన కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏపీలో టిడిపి రాజకీయ అవసరాలు, ప్రయోజనాలు, బలాబలాలు అన్నిటినీ లెక్క చూసుకొని బహుశః టిడిపి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కనుక తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టిడిపి పోటీ నుంచి విరమించుకోవడం సరైన నిర్ణయమా కాదా? అనేది ఫలితాలు వెలువడిన తర్వాత తెలుస్తుంది.

ADVERTISEMENT

అయితే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్న టిడిపి, జనసేనలు తెలంగాణ ఎన్నికలలో పూర్తి భిన్నమైన మార్గాలలో ప్రయాణిస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలవాలని కోరుకొంటూ టిడిపి త్యాగానికి సిద్దపడగా, బీజేపీ గెలవాలని జనసేన త్యాగానికి సిద్దపడుతుండటం చాలా విచిత్రంగా ఉంది! వీటిలో టిడిపి నిర్ణయమే సరైనదిగా కనిపిస్తోంది.

ఏపీలో టిడిపితో పొత్తులు పెట్టుకోవడానికి బీజేపీ అధిష్టానం ఆసక్తి చూపడం లేదు కనుక కాంగ్రెస్‌ వైపు టిడిపి మొగ్గుచూపడం సహజం. కానీ జనసేన పార్టీ ఏపీలో టిడిపితో పొత్తుకి సిద్దపడి తెలంగాణలో బీజేపీతో పొత్తుపెట్టుకోవడం, దాని కోసం త్యాగాలకు సిద్దపడుతుండటమే విచిత్రంగా ఉంది.

ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే అది ఏపీలో టిడిపికి తప్పకుండా సాయపడవచ్చు… కుదిరితే టిడిపితో పొత్తులు కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా పవన్‌ కళ్యాణ్‌ టిడిపితోనే ఉంటారా లేక బీజేపీవైపు వెళ్ళిపోతారా?

అయినా కాంగ్రెస్‌, బీజేపీల కోసం టిడిపి, జనసేనలు ఈవిదంగా త్యాగాలు చేయడం అవసరమా?ప్రతీ ఎన్నికలలో కాంగ్రెస్‌ కోసమో లేదా బీజేపీల కోసమో ఇలా త్యాగాలు చేసుకొంటూపోతే రాజకీయంగా రెండూ పార్టీలు నష్టపోతున్నాయా?ఏమైనా లాభపడుతున్నాయా?

ఈ వ్యూహాలు, త్యాగాల లెక్కలు అన్నిటినీ పక్కనపెట్టి, రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపి, జనసేనలు కలిసి పనిచేస్తూ ఎన్నికలలో గెలవలేవా?ఆనాడు తెలంగాణ కాంగ్రెస్‌ కోసం కాంగ్రెస్‌ అధిష్టానం ఏపీని, ఏపీ కాంగ్రెస్‌ని పణంగా పెట్టి ఏం లాభపడింది?ఇప్పుడు టిడిపి, జనసేనలు త్యాగాలు చేసి ఏమి లాభపడతాయి? ఆలోచించుకొంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories