కొరటాల శివ దర్శకత్వంలో మోహన్ లాల్ – జూనియర్ ఎన్టీఆర్ కాంభినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్” సినిమా, ఇప్పటికే 50 కోట్ల క్లబ్ ను దాటి విజయవంతంగా పరుగులు పెడుతోంది. నిజానికి ఈ విజయం చిత్ర యూనిట్ కూడా ఊహించినది కాదు. ఆశించిన దాని కంటే రెట్టించిన ఉత్సాహం ఇచ్చిన ప్రేక్షకులను మరింత ఉత్తేజంలో ముంచేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
“జనతా విజయోత్సవం” పేరుతో ఈ నెల 10వ తేదీన విశాఖలో భారీ స్థాయిలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు ‘జనతా గ్యారేజ్’ చిత్ర యూనిట్ మొత్తం మోహన్ లాల్, జూనియర్ ఎన్టీఆర్, నిత్యామీనన్, సమంత అందరూ హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ‘జనతా గ్యారేజ్’ పీఆర్ఓ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ వేడుకకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించనుంది.
తొలి వారం వసూళ్ళల్లో ఉత్తరాంధ్ర ఆల్ టైం వసూళ్ళ రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోవడంతోనే ఈ వేడుకను విశాఖలో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా ‘జనతా గ్యారేజ్’ రికార్డుల దుమ్ము దులుపుతోంది. దీంతో ‘యంగ్ టైగర్’ అభిమానులంతా ‘జయహో జనతా’ అంటూ పండగ చేసుకునే మూడ్ లో ఉన్నారు.



