ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలలో నిత్యం ప్రజలలో ఉండే పథకం “కూల్చివేతల “పథకం. ఈ ఒక్క పథకాన్ని వైసీపీ నాయకులు నిర్విరామంగా కొనసాగిస్తున్నారని తాడిపత్రి టీడీపి నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి నియోజక వర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిని కూల్చివేశారు స్థానిక అధికారులు.
కొత్త భవనాల పేరుతో ఉన్న భవనాలను కూల్చివేయడం దారుణం., కనీసం ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపించకపోవడంపై జేసీ మండిపడ్డారు. అసలే వేసవి కాలం పేద ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇక్కడి వస్తారు., ఇప్పుడు ఈ ఆసుపత్రిని కూల్చివేస్తే వారంతా ఎక్కడికి వెళ్ళాలి.? అంటూ అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు.
ఇది ఒక్క తాడిపత్రి ప్రాంతానికి సంబంధించిన ఆసుపత్రి మాత్రమే కాదని ఇక్కడికి పక్క మండలాల నుండి రోగులు వస్తుంటారని ఆవేదన వ్యక్తం చేసారు. రోజుకు 600 మంది వచ్చే ఆసుపత్రికి ఇప్పుడు వైద్యులు ‘ఓపి’ ఎక్కడ నుంచి చూస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ స్థానిక అధికారులను నిలదీశారు టిడిపి నాయకులు. ఒక పక్క తాడిపత్రి ఆసుపత్రి కూల్చివేతలతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం మరో పక్క శ్రీకాకుళంలో చిల్డ్రన్ పార్కు కూల్చివేయడం చూస్తుంటే ఇప్పటితో ఈ కూల్చివేతల పర్వం ముగిసేలా లేదంటున్నారు ఏపీ ప్రజలు.
టిడిపి హయాంలో శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట పట్టణంలో కట్టిన ‘ఎర్రంనాయుడు చిల్డ్రన్స్ పార్కు’ ను అధికార పార్టీ అండదండలతో కూల్చివేశారని మాజీ ఎమ్మెల్యే రామ్ మూర్తి ఫైర్ అయ్యారు. వృద్దులకు., చిన్నారులకు ఉపయోగపడే పార్కును కూల్చివేయడం ఈ ప్రభుత్వం విధ్వంసక పాలనకు అద్ధం పడుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు తమ నిరసనను తెలిపారు.
‘ప్రజా వేదిక’ తో మొదలైన ఆ ‘కూల్చివేతల పధకం’ ఇప్పటికే నవరత్నల పేరుతో రాష్ట్ర ప్రజల సామాజిక., ఆర్ధిక స్థితిగతులను కూల్చివేసిందని., మూడు రాజధానులతో రాష్ట్రంలో అభివృద్ధిని కూల్చేసిందని., న్యాయమూర్తులను తప్పుపట్టి న్యాయవ్యవస్థ తీర్పులను కూల్చేసిందని., తన కల్తీ మద్యంతో పేదవాడి ఆరోగ్యాన్ని కూల్చేసిందని., ప్రభుత్వ బడులలో తెలుగు మీడియంను నిషేధించి తెలుగు భాషను కూల్చేసిందంటూ., “కూల్చివేతలకు కాదేది అనర్హం” అనేదే వైసీపీ ఏజెండా అంటూ టిడిపి నాయకులు ప్రభుత్వ తీరుని ఎండగట్టారు.



