రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ‘ఓటుకు నోటు’ కేసులో కీలక నిందితుడిగా భావించిన జెరూసలెం మత్తయ్యను తెలంగాణ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ‘ఓటుకు నోటు’ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా హైదరాబాద్ ను వీడి నవ్యాంధ్రకు తరలివెళ్లిన మత్తయ్య, హైకోర్టును ఆశ్రయించిన వైనం గతంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన తర్వాతే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. అయితే ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకున్న మత్తయ్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని తనదైన శైలిలో చేతివాటం ప్రదర్శించారట. ఉద్యోగాల పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్న మత్తయ్య, ఉద్యోగాలు ఇప్పించడంలో చేతులెత్తేశారు. దీనిపై ఫిర్యాదునందుకున్న హైదరాబాదు పోలీసులు గురువారం రాత్రి హైదరాబాద్ లోనే అరెస్ట్ చేశారు. అయితే ‘ఓటుకు నోటు’ కేసులో నిందితుడిగా ఉన్నందున మత్తయ్య అరెస్ట్ సంచలనాత్మకమైంది.



