ప్రస్తుతం సినీ ఆడియో వేడుకలంటే కుటుంబ బలాబలాలుగా మారిపోయాయి. ఒకప్పుడు ఆడియో వేడుకకు ఒక విశిష్ట అతిథి వచ్చి పాటలను విడుదల చేసేవారు. కానీ, ప్రస్తుతం మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని, ఘట్టమనేనిల సినిమాల ఆడియో వేడుకలకు ఆయా కుటుంబాలలోని వ్యక్తులే అతిధులుగా విచ్చేసి, పాటలను విడుదల చేస్తున్నారు. కేవలం చిన్న సినిమాల ఆడియోలకు మాత్రమే ఇతర హీరోలంతా కలిసి సందడి చేస్తున్నారు. ఇక, నేడు విడుదల కాబోతున్న నందమూరి కళ్యాణ్ రామ్ “ఇజం” ఆడియో వేడుకకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు.
‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ వంటి సినిమాలతో మాంచి ఊపులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, తన అన్నయ్య నటిస్తున్న సినిమాల పాటల పండగకు విచ్చేయడం ఆనవాయితీ మారింది. ఆ క్రమంలో తనకు ‘టెంపర్’ ఇచ్చిన పూరీ జగన్నాధ్, తన అన్నయ్యకు ‘ఇజం’ ఇస్తున్న సందర్భంలో, అందులో భాగస్వామి కాబోతున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ ను మలుపు తిప్పే చిత్రంగా సినీ వర్గాలు భావిస్తున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ రాక ఇంకాస్త దోహదం చేసే అంశమే. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ “ఇజం”కు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో… ప్రస్తుతం అందరి చూపులు ధియేటిరికల్ ట్రైలర్ వైపుకు మళ్ళాయి.



