jr Ntr Speech at rrr pre release eventజూనియర్ ఎన్టీఆర్… ఈ పేరు కేంద్రంగా గతంలో చాలా జరిగింది, వర్తమానంలో కొంత జరుగుతోంది… భవిష్యత్తులో ఇంకా చాలా జరగొచ్చు కూడా! సినీ హీరోగా అడుగుపెట్టిన అనతికాలంలో ఇండస్ట్రీ రికార్డులను ఎలా అయితే సొంతం చేసుకున్నాడో, అంతే తొందరగా మళ్ళీ జారిపడిపోయారు. పడిన తప్పటడుగులు సరిచేసుకుంటూ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి అత్యంత చేరువ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి వంటి హేమాహేమీలకు పోటీగా తన వాక్చాతుర్యంతో టీడీపీ క్యాడర్ ను పడేసారు. ఎంతలా అంటే… నాటి సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలు సాగాయి. అప్పటివరకు రాజకీయ డైలాగ్ లు తెలియని తారక్ నోటివెంట అనర్గళంగా వచ్చిన రాజకీయ ప్రసంగాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేసాయి.

అప్పటినుండి క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ కు ఎన్టీఆర్ లో భవిష్యత్తు కనిపించింది. ఇదే ప్రత్యర్థి పార్టీలకు వరమయ్యింది. ఓ పక్కన సినీ కెరీర్ ను కొనసాగిస్తుంటే, రాజకీయాలతో ముడిపెట్టి అటు టీడీపీని, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టడం ప్రత్యర్థి పార్టీల వంతయ్యింది. ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకునే అవకాశం ఉండదు గనుక, జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా ఇప్పటివరకు కూడా రాజకీయ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.

ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా కూడా తన సమయస్ఫూర్తితో ప్రసంగించి, ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడడం జూనియర్ ఎన్టీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇందుకు తాజా నిదర్శనమే “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్. స్టేజ్ పైన రాజమౌళి, రామ్ చరణ్ లు ప్రసంగించిన తర్వాత మైక్ పట్టుకున్న తారక్ ప్రసంగం అందరిని ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా పునీత్ పై చేసిన వ్యాఖ్యలు బహుశా రాజ్ కుమార్ కుటుంబానికి కన్నీటిని తెప్పించి ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అంతకుముందు రాజమౌళి చాలాసేపు ప్రసంగించారు గానీ, మనసుకు హత్తుకునే విధంగా మాత్రం లేవు. కానీ మైక్ పట్టుకున్న మొదటి మాట నుండి, చరణ్ అభిమానులు కూడా నాకు దొరికారు అని సహచర హీరో ఫ్యాన్స్ ను పడేయడం, చివరగా మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీ ఇంటి దగ్గర మీ అమ్మ, నాన్న ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేటంత వరకు స్పష్టంగా తెలియజేసి, మరోసారి తన వాగ్ధాటి పవర్ ఏమిటో చాటిచెప్పారు.

ఈ సమయస్ఫూర్తి ప్రసంగాలే ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే వీలైనంత వరకు టీడీపీని – జూనియర్ ఎన్టీఆర్ ను దూరం చేసేందుకు ‘బ్లూ మీడియా’గా పిలవబడే వారంతా కంకణం కట్టుకుని మరీ ప్రత్యేక కధనాలను ప్రసారం చేస్తుంటారు. బోడి గుండుకు – మొకాలుకి లింక్ పెట్టి మరీ వీరిద్దరికి వైరం తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. కానీ వాటన్నింటిని తన చాతుర్యంతో ఎదుర్కోవడం జూనియర్ ఎన్టీఆర్ కు అలవాటైపోయింది.

నాడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున రాజకీయ ప్రసంగాలు చేసినపుడు ప్రత్యర్థిగా ఉన్న ఇద్దరిలో ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మరొకరు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాలలో తలపండిపోయిన వైఎస్సార్ ను గానీ, ఇండస్ట్రీలో ఎవరెస్టు శిఖరాలను అధిరోహించిన చిరంజీవిని గానీ నొప్పించకుండా విమర్శించిన శైలి బహుశా ఎవరూ మరిచిపోకపోవచ్చు. అంతటి రాజకీయ చతురత ఎక్కడి నుండి వచ్చిందో గానీ, ఆ “వాక్చాతుర్యత – వాగ్ధాటి”కే ప్రత్యర్థి వర్గాలంతా భయబ్రాంతులకు గురయ్యేది.

అయితే ప్రస్తుతం రాజకీయాలతో సంబంధం లేకుండా సినీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఆనాటి ప్రచారం తర్వాత ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ ప్రకటన ఇవ్వలేదు. మధ్యమధ్యలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సంయమనంతో వ్యవహరించడం జూనియర్ ఎన్టీఆర్ స్పెషాలిటీగా మారింది. కానీ ఎప్పుడు అడుగుపెట్టినా చరిత్ర సృష్టించేటంత నమ్మకాన్ని అభిమానులకు, టీడీపీ క్యాడర్ కు ఉండడమే, ‘బ్లూ మీడియా’కు మింగుడు పడని అంశం.