హీరోలకు గానీ, హీరోయిన్లకు గానీ దేవాలయాలు నిర్మించే సంస్కృతి తెలుగు ప్రేక్షకులకు లేదన్న విషయం తెలిసిందే. నాటి మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదలు నాచురల్ స్టార్ నాని వరకు అనేక మంది ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. కానీ ఎవరికి ఎలాంటి గుడి వంటివి చోటు చేసుకోలేదు. అయితే ఈ సంస్కృతి తమిళనాట చాలా సర్వసాధారణం. తమకు నచ్చిన హీరోయిన్లకు, హీరోలకు దేవాలయాలు నిర్మించి పూజించడం తమిళుల ఆనవాయితీ కాగా, దీనిని కర్ణాటకలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అనుసరిస్తున్నారనేది లేటెస్ట్ టాక్.
“టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్”లతో పెంచుకున్న అభిమానగణాన్ని ఇటీవల విడుదలైన ట్రిపుల్ రోల్ ‘జై లవకుశ’ రెట్టింపు చేయడంలో సక్సెస్ కాగా, కర్ణాటకలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమానాన్ని గుడి రూపంలో చాటిచెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ గుడి నిర్మాణ ప్రయత్నాలు మొదలుపెట్టగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. మరి ఇందుకు సంబంధించిన సమాచారం జూనియర్ ఎన్టీఆర్ కు తెలుసో లేదో గానీ అభిమానులు మాత్రం తమ దైవాన్ని పూజించే పనిలో నిమగ్నమైనట్లు కనపడుతోంది.





