ఈసారి బీహార్ శాసనసభ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై వివిధ సర్వేలు చెప్పినట్లుగానే ఫలితాలు రాబోతున్నాయి. బీహార్‌లో మళ్ళీ బీజేపి-జేడీయు (ఎన్డీయే) భారీ విజయం సాధిస్తుందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీతో గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. అవి చెప్పినట్లుగానే జరుగబోతోంది.
జూబ్లీహిల్స్: మొదటి రెండు రౌండ్స్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ వరుసగా 62 ఓట్లు, 1,082 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌లో కూడా 1,200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కనుక కాంగ్రెస్ గెలుపు ఖాయమనే భావించవచ్చు.
కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారని, రెండేళ్ళ పాలనకు ఈ ఎన్నిక రిఫరెండం అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాదించారు.
కనుక ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే, కాంగ్రెస్ పాలన బాగుందని ప్రజలు భావిస్తున్నట్లే అనుకోవలసి ఉంటుంది.
బీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్‌కు మంచి పట్టున్న ఈ స్థానంలో గెలవలేకపోతే పరువు పోతుందని తెలిసి ఉన్నప్పటికీ, కేటీఆర్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, పూర్తి బాధ్యత తానే వహించడం వలన ఓడిపోతే ఆ ఓటమి భూతద్దంలో నుంచి చూసినట్లు మరింత పెద్దదిగా కనిపిస్తుంది.
ఇక బీహార్‌లో 223 స్థానాలలో ఎన్డీయే-159, కాంగ్రెస్-జేడీయు- 80 స్థానాల ఆధిక్యంలో ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ యొక్క జన్ సూరజ్ పార్టీ ఒక్క చోట కూడా ఆధిక్యం సాధించలేకపోయింది.
దేశంలో కాంగ్రెస్, బీజేపిలతో సహా అనేక ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి గెలిపించిన ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో సొంత పార్టీ పెట్టుకొని గెలిపించుకోలేక చతికిలపడుతున్నారు. కనీసం 10-15 సీట్లు గెలుచుకున్నా ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి కనుక అని అందరూ అనుకునేవారు. కానీ 223 సీట్లకు పోటీ చేసి రెండు మూడు సీట్లు కూడా గెలుచుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు పాపం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అత్యుత్సాహం ప్రదర్శించి కేటీఆర్, తన తెలివి తేటలు, ఎన్నికల నైపుణ్యంపై అతిగా నమ్మకం పెట్టుకొని ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ ఎదురుదెబ్బలు తినబోతున్నారు.. పాపం!







