తెలుగు చిత్రసీమలో పెను కలకలం రేపే ఘటన నమోదైంది. మంచు మనోజ్ హీరోగా నిర్మాత అచ్చిబాబు నిర్మిస్తున్న సినిమాలో జూనియర్ ఆర్టిస్టులు నిర్మాతపై దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. విశాఖపట్టణంలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఫైటింగ్ సన్నివేశాల్లో నిజమైన ఫైటింగ్ జరిగింది. తాగిన మైకంలో రంగప్రవేశం చేసిన జూనియర్ ఆర్టిస్టులు, చిత్ర నిర్మాత అచ్చిబాబును వ్యాన్ నుంచి కిందకు లాగి ఇష్టారాజ్యంగా దాడి చేయడంతో, హీరో మంచు మనోజ్ తో పాటు యూనిట్ మొత్తం షాక్ కు గురైంది.
షూటింగ్ లో స్థానికులకు అవకాశం కల్పించలేదన్న కారణంగానే జూనియర్ ఆర్టిస్టులు ఈ దాడికి తెగబడినట్లు ప్రాధమిక సమాచారం. ఈ దాడిలో అచ్చిబాబుకు గాయాలు కాగా, జూనియర్ ఆర్టిస్టులపై యూనిట్ సభ్యులు పరవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన హీరో మంచు మనోజ్, జూనియర్ ఆర్టిస్టుల వైఖరిపై నిప్పులు చెరిగారు. టాలీవుడ్ చరిత్రలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ కేంద్రంగానే చిత్ర నిర్మాణం జరుగుతున్నా… విశాఖలో షూటింగ్ అంటే హుషారుగా కదిలి వస్తున్న తామంతా, ఈ దాడి నేపథ్యంలో ఇక్కడికి రావాలంటేనే జడవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఫెడరేషన్ కార్డులు లేని జూనియర్ ఆర్టిస్టులే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించిన మంచు, ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ లేఖ రాశారు. ఇదిలా ఉంటే… ఈ దాడిని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది.
సంచలనంగా మారిన ఈ ఘటనపై ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన లైవ్ డీబేట్ నిర్వహించింది. మంచు మనోజ్ ఆరోపిస్తున్నట్లు తాము అచ్చిబాబుపై ఎలాంటి దాడికి పాల్పడలేదని ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిన జూనియర్ ఆర్టిస్టులు ప్రసాద్, వెంకటేశ్ లు తెలిపారు. అచ్చిబాబు తమకు బకాయి ఉన్నారని, ఆ బకాయిలు చెల్లించమని మాత్రమే అడిగామని తెలిపారు. పలువురికి జీవనోపాధి కల్పిస్తున్న మంచు మనోజ్ లాంటి వారు ఈ రకంగా తమపై తప్పుడు ఆరోపణలు చేయడం తమను ఆవేదనకు గురి చేస్తోందని వారు చెప్పారు. ఈ ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సినీ పరిశ్రమకు మంచి పరిణామం కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



