కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఒకప్పుడు టిడిపికి కంచుకోట ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దానిని సొంతం చేసుకొంది. 2014, 19లో దానిలో వైసీపీ పాగా వేసింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోవడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వైసీపీ, టిడిపిల మద్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఇది సహజమే.
జగ్గంపేట వైసీపీలో కూడా అంతర్గతంగా మరో పోరు కొనసాగుతోంది. టిడిపి నుంచి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ తోట నరసింహం, వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మద్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. అయితే గత 2-3 ఏళ్ళుగా తోట నరసింహం ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన కుమారుడు తోట రాంజీ నియోజకవర్గంలో చురుకుగా పనిచేస్తున్నారు.
ఇటీవల తోట నరసింహం మళ్ళీ కోలుకోవడంతో జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు రాంజీ మాట్లాడుతూ, “పంది ఎంత బలిసినా అది పందే అవుతుంది తప్ప ఏనుగు కాలేదు. ఇక్కడ ఎమ్మెల్యే (జ్యోతుల చంటిబాబు) పరిస్థితి కూడా సరిగ్గా ఇదే.
ఆయన ఇక్కడ మరో పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు తిరిగినా మా తండ్రిగారికే ప్రజలు, కార్యకర్తలు మద్దతు ఉంటుంది. ఆయన మా నాన్నగారి గురించి ఏదేదో వాగుతున్నారు. వాటికి నేను కాదు మా నాన్నగారే సరైన సమాధానం చెపుతారు. వచ్చే ఎన్నికలలో జగ్గంపేట నుంచి ఆయనే పోటీ చేయబోతున్నారు. ఇది తధ్యం. కనుక ఆయనే నీ లెక్కలన్నీ తేల్చేస్తారు,” అని హెచ్చరించారు.
తోట నరసింహం మాట్లాడుతూ, “రాజకీయాలు మాకేమీ కొత్తకాదు. అవి మా రక్తంలోనే ఉన్నాయి. ఒక్క గంట టైమ్ ఇస్తే చాలా నీ సంగతి తేల్చేస్తాను. నువ్వు (ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు) 100 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేశావని ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ ఆరోపించినప్పుడు సమాధానం చెప్పుకోలేకపోయావు కదా?కనీసం నీ అనుచరులు ఎవరూ కూడా వారి ఆరోపణలను ఖండించలేకపోయారు.
ప్రతిపక్షాలను చూస్తే భయపడేవాడివి నువ్వా నా గురించి మాట్లాడేది? నా గురించి మాట్లాడాలంటే పది జన్మలు ఎత్తాలని గుర్తుంచుకో. నాకు ఆరోగ్యం బాగోలేకపోవడం వలననే ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయాను. ఇప్పుడు పూర్తిగా కోలుకొన్నాను కనుక ఇక నుంచి నీ సంగతి నేనే స్వయంగా చూస్తాను. వచ్చే ఎన్నికలలో జగ్గపేట నుంచి నేనే పోటీ చేస్తాను. దమ్ముంటే మళ్ళీ టికెట్ సంపాదించుకో,” అంటూ సవాల్ విసిరారు.
వైసీపీ నేతల మద్య విభేధాలు, టికెట్ల కోసం జరిగే ఇటువంటి కొట్లాటలలోనే ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారో కూడా వారి నోటితోనే స్వయంగా బయటపెట్టుకొంటారు. తోట నరసింహం లెక్క ప్రకారం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఖాతాలో 100 ఎకరాలు వేసుకొన్నారని తేలింది కదా?
గత ఎన్నికలలో జగ్గంపేట నుంచి టిడిపి అభ్యర్ధిగా జ్యోతుల నెహ్రూ పోటీ చేశారు కానీ వైసీపీ ప్రభంజనంలో ఓడిపోయారు. అయితే ఈసారి అటువంటి ప్రభాజనాలు ఏమీ ఉండవు. పైగా వైసీపీ ఇద్దరూ కుమ్ములాడుకొంటున్నారు కూడా. మరో విషయం ఏమిటంటే జగ్గంపేటలో కాపు సామాజికవర్గం చాలా బలంగా ఉంది. ఒకవేళ టిడిపి, జనసేనలు కలిసి పనిచేస్తే వారి ఓట్లు తనకే పడతాయని కనుక వచ్చే ఎన్నికలలో తాను అవలీలగా గెలవగలనని జ్యోతుల నెహ్రూ నమ్మకంగా ఉన్నారు. మరి జగ్గంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, తోట నరసింహం, టిడిపి నేత జ్యోతుల నెహ్రూలలో ఎవరి రాజకీయం ఫలిస్తుందో చూడాలి.



