kaleswaram-project-and-medigadda-barrage-Construction Problems and Solutions Only KCR

నీళ్ళ విషయంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందంటూ వాదిస్తూ కేసీఆర్‌ ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నారు.

తర్వాత కోటి ఎకరాలకు నీళ్ళు పారిస్తానంటూ సుమారు లక్ష కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దాని నుంచి నీళ్ళు ఎత్తిపోస్తూ తెలంగాణలో పలు జిల్లాలకు నీళ్ళు పారించి చూపారు. అది చూసి అందరూ ఆహా కేసీఆర్‌.. ఓహో కేసీఆర్‌ అని పొగిడారు కూడా.

Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!

అయితే ఎత్తిపోతల కంటే సహజంగా గ్రావిటీ పద్దతిలో నీరు పారేవిదంగా తక్కువ ఖర్చుతో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించుకుంటే మంచిదని కాంగ్రెస్‌ నేతలు పదేపదే చెపుతూనే ఉన్నారు.

కానీ కేసీఆర్‌ 80 వేల పుస్తకాలు చదివిన మహా మేధావి కనుక తన ఆలోచనలు ‘కాంగ్రెస్‌ సన్నాసులకు’ అర్దం కావని తేల్చి చెప్పేశారు.

Also Read – జగన్‌ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?

మొత్తం మీద తాను కోరుకొన్నట్లే మేడిగడ్డ వద్ద తొలి బ్యారేజ్‌ నిర్మించి, ఆ నీటిని ఎత్తిపోయడం కోసం డజన్ల కొద్దీ బాహుబలి మోటర్లు ఏర్పాటు చేశారు. వాటిని, వాటితో పారే నీటిని చూపించి కేసీఆర్‌ చప్పట్లు కొట్టించుకున్నారు. పాలాభిషేకాలు కూడా చేయించుకున్నారు.

అయితే ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 70-80,000 కోట్లు అప్పులు తెస్తున్నప్పుడు, తిరిగి చెల్లించడం ఎలా?అంటే పరిశ్రమలకు, త్రాగునీటి విక్రయాల ద్వారా ఆదాయం సమకూరుతుందని అప్పులు ఇచ్చిన ఆర్ధిక సంస్థలకు చెప్పారు. ఆ అప్పులు చెల్లింపులకి కేసీఆర్‌ (తెలంగాణ ప్రభుత్వం) గ్యారెంటీ ఇచ్చారు.

Also Read – మనోభావాలను….మానసిక క్షోభను ‘గాలి’కొదిలేసినట్టేనా.?

అయితే నీటి అమ్మకం ద్వారా కాళేశ్వరం కార్పొరేషన్‌కు కేవలం రూ.7 కోట్లు మాత్రమే ఆదాయం లభిస్తోందని తెలంగాణ ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది కనుక ఈ ఆర్ధిక సంవత్సరంలో అసలు కింద రూ.7,382 కోట్లు, వడ్డీ కింద రూ.6,519 కోట్లు కలిపి మొత్తం రూ.13,901 చెల్లించిందని రామకృష్ణారావు చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ ఎదుట నిన్న హాజరయ్యి ఈ గొప్ప విషయాలు బయట పెట్టారు.

రైతులకు సాగు నీటిని, ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మాత్రం భారం భరించడం అవసరమే. తప్పు కాదు. కానీ సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసి నభూతో నభవిష్యత్ అన్నట్లు మేధావి చేతిలో నిర్మించబడిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్‌ ఆయన అధికారంలో ఉండగానే క్రుంగిపోయింది!

దాని దిగువన కట్టిన మరికొన్ని బ్యారేజీలు అప్పుడే బీటలువారాయి. ఓ పంప్ హౌసులో బాహుబలి మోటర్లు వరద నీటిలో మునిగిపోయాయి.

కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు నిలువ చేయలేదు. కనుక ప్రాజెక్టు నుంచి నీళ్ళు రావు.

నీళ్ళు రాకపోయినా ఏడాది తిరిగేసరికి అసలు, వడ్డీ కలిపి ప్రభుత్వం రూ.13,901 చెల్లించక తప్పదు. అంటే ఉగాది పంచాంగంలో చెప్పుకున్నట్లు ఆదాయం సున్నా, వ్యయం పది అని చెప్పుకోవాలేమో?




కాంగ్రెస్‌ సన్నాసుల చాతకానితనం వల్లనే ఈ సమస్యలని పరిష్కరించలేకపోయారని కేసీఆర్‌ చెప్పారు. కనుక మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కాగానే మంత్రదండం తిప్పి ఈ సమస్యలన్నిటినీ ఇట్టే పరిష్కరించేస్తారు. అంతవరకు ఈ ఇకఇకలు, పకపకలు, సన్నాయి నొక్కులు భరించాల్సిందే. తప్పదు!