Kalvakuntla Kavitha Comments on AP Political Leaders

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ, తెలంగాణగా విభజించబడి దశాబ్దం గడిచిపోయినా ఇంకా తెరాస గా మారిన బిఆర్ఎస్ మాత్రం అదే ప్రాంతీయవాదంతో రాజకీయం చేస్తూ ఆంధ్రా పాలకులు, ఆంధ్రోళ్లు అంటూ రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ చిచ్చు రేపెడుతుంది.

తమ ఉనికిని కాపాడుకోవడానికి, తమ పార్టీకి తిరిగి జీవం పోయడానికి బిఆర్ఎస్ నేతలు మరోసారి ఆంధ్రా, తెలంగాణ అంటూ పాత రాగం అందుకున్నారు. అయితే నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న స్వామిని దర్శించుకున్న కేసీఆర్ కుమార్తె కవిత ఆంధ్రా పాలకుల మీద చేసిన విమర్శలు దైవత్వంలోను ప్రాంతీయవాదాన్ని చొప్పించేలా ఉన్నాయి.

Also Read – పడి లేచిన కెరటం .. జనసేన ..

వేములవాడ రాజన్న ను దర్శించుకుంటే ఎన్నికలలో ఓటమి తప్పదని గతంలో ఆంధ్రా పాలకుల తప్పుడు ప్రచారం చేసి ఇక్కడ దేవుళ్లను కూడా బద్నామ్ చేసే వారు. కానీ మన కేసీఆర్ హయాంలో అదే రాజన్న పేరుతో సిరిసిల్ల రాజన్న జిల్లాను ఏర్పాటు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ తన ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికై దాదాపు 250 పైగా వెచ్చించారంటూ చెప్పుకొచ్చిన కవిత దేవాలయాల మీద అక్కడి దేవుళ్ళ మీద కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం.?

ఇదే ఆంధ్ర పాలకుల హయాంలో హైద్రాబాద్ లో హైటెక్ సిటీ రూపకల్పన జరిగింది, అదే ఆంధ్రా పాలకుల నాయకత్వంలో హైద్రాబాద్ లో సైబరాబాద్ అనే ఐటీ మహానగరమే నిర్మించబడింది, నేడు తెలంగాణ పాలకులు అనుభవిస్తున్న అనేక అనేక సౌకర్యాలు, అభివృద్ధి ఫలాలు అన్ని కూడా నాడు ఆంధ్రా పాలకుల ప్రభుత్వంలోనే పురుడు పోసుకున్నాయి, పట్టాలెక్కాయి.

Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!

తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైన హైద్రాబాద్ ను ప్రపంచపటంలో పెట్టిన ఘనత ఆనాటి ఆంధ్రా పాలకులదే, అలాగే హైద్రాబాద్ కు మణిహారమైన టాంక్ బండ్ అభివృద్ధి, ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుల నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పొతే తెలంగాణకు హైద్రాబాద్ ను ఒక అక్షయ పాత్రగా మార్చి, ఆదాయమార్గాలను సృష్టించిన ఘనులు కూడా ఆనాటి ఆంధ్రా పాలకులే.

హైద్రాబాద్ అభివృదిలో ఆంధ్రా పాలకుల ఆలోచనలు ఉంటే, ఆ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వానికి అవసరమైన వనరులను అందించడంలో ఆంధ్రా ప్రజల స్వేదం దాగుంది, అందులో వారి కష్టం కనపడుతుంది. హైద్రాబాద్ అభివృద్ధిలో ఇంత కీలక పాత్ర పోషించిన ఆంధ్రా పాలకులు, ఆంధ్ర ప్రజలు ఇప్పటికి తెలంగాణ పార్టీల నాయకుల నోటికి దోషులుగానే కనిపిస్తూనే ఉన్నారు, ఇప్పటికి నిందలు మోస్తూనే ముందుకెళ్తున్నారు.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

ఆంధ్రా పాలకులు కూడా తమ సొంత రాష్ట్రంలో విపక్షాలు ఏదైనా ఒక్క విమర్శ తమకు వ్యతిరేకంగా చేస్తే పదుల సంఖ్యలో మీడియా ముందుకొచ్చి వారి పై ఎదురు దాడి చేస్తారు. కానీ ఇలా పొరుగు రాష్ట్రాల వారు తమ పార్టీ రాజకీయ మనుగడ కోసం అనవరసమైన వివాదాలలోకి తమను లాగుతున్న కనీసం వారి విమర్శలను ఖండించడానికి కూడా ముందుకు రావడం లేదు.

గత ఆంధ్రా పాలకులు అంటే అందులో టీడీపీ అథినేత చంద్రబాబు నాయుడు ఉంటారు, అలాగే వైసీపీ అథినేత వైస్ జగన్ తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ఉంటారు. కానీ ఈ రెండు పార్టీల నేతలు ఒకరి పై ఒకరు రాజకీయ బురద చల్లుకోవడానికి చూపే శ్రద్ధతో ఒక్క పిసరు పొరుగు రాష్ట్ర నేతల విమర్శల పై పెడితే మరోమారు ఇలా పక్క రాష్ట్రాల వారితో అడ్డమైన చివాట్లు తినే అవసరం ఉండకపోవచ్చు.




బిఆర్ఎస్ పార్టీ ఇంతలా ఆంధ్రా నాయకులను కవ్విస్తున్నా, రెచ్చగొడుతున్నా వారికీ మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే, బాబు ముఖ్యమంత్రిగా కనిపించినప్పుడు మాత్రమే బిఆర్ఎస్ ఈ తరహా ప్రాంతీయ వాద రాజకీయంతో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారు. మరి దీని ఆంతర్యం ఏమిటో.?