కవితకు విముక్తి రాదా.?

Kavitha

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఢిల్లీ లిక్కర్ స్కాం లో మార్చ్ 15 న అరెస్టైన కేసీఆర్ కుమార్తె కవిత జైలుకెళ్లి నెలలు గడుస్తున్నా ఇంకా బయటకు రాలేకపోతున్నారు. కవిత తరువాత అదే కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిలు మీద బయటకు వచ్చి పార్లమెంట్ ఎన్నికల తంతు పూర్తి చేసుకున్నారు.

అయినా కవితకు మాత్రం తీహార్ జైలు నుండి తాత్కాలిక విముక్తి కూడా దక్కడం లేదు. మొన్నీఈ మధ్య బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే కవిత కేసుల నుండి బయట పడతారని, మళ్ళీ తెలంగాణలో రాజకీయం మొదలుపెడతారంటూ పార్టీ క్యాడర్ కు సంకేతమిచ్చారు.

ADVERTISEMENT

ఇటువంటి సందర్భంలో ఈ రోజుతో కవిత కస్టడీ ముగియనుండటంతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కవిత కుటుంబ సభ్యులు కవితకు బెయిలు రూపంలో కాస్త ఉపశమనం దొరుకుతుంది అని ఆశ పడ్డారు. అయితే మళ్ళీ వారి ఆశ నిరాశగానే మిగిలింది. కవిత కస్టడీ సమయం ముగియడంతో కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరిచారు అధికారులు.

కేసు విచారణ నిర్వహించిన ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్ట్ ఈ నెల 25 వరకు కవిత కస్టడీ సమయాన్ని పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. దీనితో కవితకు మరోసారి నిరాశ తప్పలేదు. ఢిల్లీలో కవిత కేసు ఒక కొలిక్కి వచ్చే లోపు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుండి ఎవరు ఏ కేసులో అరెస్టవుతారో అనే ఆందోళనలో ఉన్నారు బిఆర్ఎస్ శ్రేణులు.

ఇప్పటికే కేటీఆర్ ఫోన్ టాపింగ్ కేసులో ఆరోపణలు మోస్తున్నారు, కేసీఆర్ తన హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాలపడ్డారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంది. ఈ తరుణంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనేలా పరిస్థితులు మారిపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories