ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ వివిద రంగాలకు చెందిన ప్రముఖులతో నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే’ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో వేరే చెప్పక్కరలేదు. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
ఆమె ఇంటర్వ్యూ ప్రారంభంలోనే “లిక్కర్ స్కామ్‌లో నా గురించి వాస్తవాలు తెలుసుకోకుండా నేను ఆ నేరం చేసినట్లు ఎలా వ్రాశారు? అదీ ఫ్రంట్ పేజీలో వేశారు. కానీ మర్నాడు నేను దానితో నాకు సంబందం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు దానిని చిన్నగా వేశారు. అలాగే ఈ వ్యవహారంలో నా తండ్రిగారు నన్ను మందలించినట్లు వ్రాశారు. అక్కడ మేమిద్దరం మాట్లాడుకొంటున్నప్పుడు మీరు పక్కనే కూర్చోని విన్నట్లు ఎలా వ్రాశారు? అక్కడేమైనా మైక్ లేదా కెమెరా పెట్టారా? లేకపోతే మేము మాట్లాడుకొన్న మాటలను ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా? చెప్పండి, ” అంటూ సున్నితంగానే రాధాకృష్ణను గట్టిగా నిలదీశారు.
ఆమెకు రాధాకృష్ణ అంతే ధీటుగా సమాధానమిస్తూ, “మీ తండ్రిగారు మీ గురించి ఏం మాట్లాడారో నాకు తెలుసు. మీ గురించి అన్న ఓ మాట కావాలంటే తర్వాత చెపుతాను. మీరిద్దరూ మాట్లాడుకొంటే నేను వివిద మార్గాల ద్వారా మేము మాకుండే మార్గాల ద్వారా మేము తెలుసుకొంటాము,” అని చెప్పారు.
అప్పుడు కల్వకుంట్ల కవిత ఏమన్నారంటే, “మీరు ఏదేదో ఊహించి వ్రాసి ఇదే జర్నలిజం అంటారా?మీవంటి జర్నలిస్ట్ నడుపుతున్న మీడియా ఈవిదంగా వ్యవహరిస్తుందని నేను అనుకోలేదు. మీ పత్రిక కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి వ్యతిరేకిస్తూ ఎందుకు వ్రాస్తున్నారు?” అని ఘాటుగా అన్నారు.
అప్పుడు రాధాకృష్ణ “తెలంగాణ గురించి వ్రాయడం లేదు. కేసీఆర్, టిఆర్ఎస్ అంటే తెలంగాణ కాదనే విషయం మీరు మరిచిపోతున్నారు,” అని ఘాటుగా చెప్పారు. దీనిపై ఆమెకు, రాధాకృష్ణకు మద్య మరోసారి వాగ్వాదం జరిగింది.
తర్వాత రాధాకృష్ణ, “ఈ లిక్కర్ స్కామ్‌లో మీ పేరే ఎందుకు బయటకు వచ్చింది. కేటీఆర్ పేరు ఎందుకు రాలేదు? మీ మీద ఇంత తీవ్ర ఆరోపణలు చేస్తే మీ తండ్రిగారు కానీ మీ సోదరుడు కేటీఆర్ గానీ మీకు ఎందుకు మద్దతుగా మాట్లాడలేదు?” అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కల్వకుంట్ల కవిత కొంత తడబడినప్పటికీ వెంటనే తేరుకొని “ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలీదు. కానీ ఓ రాజును ఓడించాలంటే ముందుగా చుట్టూ ఉండే నా వంటి భటులను పక్కకి తప్పించే ప్రయత్నంగానే చూస్తున్నాను. దీంతో నాకు సంబందంలేదని స్పష్టంగా చెప్పాను. ఇది చాలా చిన్న వ్యవహారం. అందుకే ఎవరూ రావలసిన అవసరంలేదు. ఈ కేసులో ఎటువంటి పరిణామాలకైనా నేను సిద్దంగా ఉన్నాను,” అని చెప్పారు.
తర్వాత కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటి శాఖలను దుర్వినియోగం చేస్తోంది. దానిని అడ్డుపెట్టుకొని దొడ్డిదారిలో అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఇప్పుడు తెలంగాణను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలోనే ఈ కుట్ర అని భావిస్తున్నాను,” అని చెప్పారు.
“మరి అటువంటప్పుడు వెళ్ళి ఆ బోనులో ఎందుకు చిక్కుకొన్నారు? మీ జాగ్రత్తలో మీరుండాలి కదా?” అని రాధాకృష్ణ ఎదురు ప్రశ్నించారు.
ఆ తర్వాత మీ నాన్నగారు (కేసీఆర్) తిక్కగా మాట్లాడటం, మోడీని వ్యక్తిగతంగా దూషించడం, అహంభావం ప్రదర్శించబట్టే ఈ పరిస్థితి వచ్చిందని కుండ బద్దలు కొట్టినట్లు చాలా స్పష్టంగా రాధాకృష్ణ చెప్పేశారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ ఇంచుమించు ఒకేలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. టిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం దళితబంధు పధకం ప్రకటించడం చాలా తప్పని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి మరో పెద్ద తప్పు చేశారు. ఇటువంటి తప్పులే ఈ పరిస్థితికి కారణం అని రాధాకృష్ణ అన్నారు. అయితే దళితబంధు పధకాన్ని కల్వకుంట్ల కవిత గట్టిగా సమర్ధించుకొన్నారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ కేసీఆర్ ప్రభుత్వానికి ఒక చక్కటి సలహా ఇచ్చారు. రాజకీయాలలో ప్రజాస్వామ్యాన్ని బ్రతకనిచ్చి పద్దతిగా రాజకీయాలు చేయాలని సూచించారు. ఇప్పుడు చేతిలో అధికారం ఉంది కదా అని ప్రత్యర్ధులను అణచివేస్తే, రేపు మరొకరు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళూ మీతో అలాగే వ్యవహరిస్తారని గుర్తుంచుకోవాలి. కనుక ప్రజాస్వామ్య విధానం ప్రకారం సాగితే రాజకీయ నాయకులు గౌరవప్రదంగా రాజకీయజీవితాన్ని ముగించగలరు,” అని చెప్పారు.
ఈ హైవోల్టేజ్ ఇంటర్వ్యూ గురించి వ్రాయడంకంటే దీనిని స్వయంగా వినగలిగితే పూర్తి సారాంశం అర్దమవుతుంది.
https://youtu.be/5QbrrrXLYmc



