కమ్మవారు జగన్ రెడ్డిని మళ్ళీ ఆదుకోగలరా?

Jagan_Chandrababu_Naiduహెడింగ్ చూసి ఇదేంటి సింగిల్ సింహం అని అభిమానులు పిలచుకునే జగన్ రెడ్డిని కమ్మవారు ఆదుకోవడం అనుకుంటున్నారా? అయితే వివరంగా అంతా చదవితే విషయం మీకే అర్దం అవుతుంది.

తండ్రి చావు సానుభూతి పవనాల పల్లకిలో అధికారం వచ్చి ఒళ్ళో వాలుతుంది అనుకున్న 2014లో అడ్డంగా బోర్లా పడ్డాక జగన్ రెడ్డి కాంప్ కు ఏం జరిగిందో అర్దం కాలేదు, ఏం చెయ్యాలో తెలియక ‘ఎలక్షన్లు అంటే వాళ్ళు ఎంత గట్టిగా కొట్టారు, మేం ఎంత గట్టిగా తీసుకున్నాం, మాకు చాన్స్ వచ్చినప్పుడు మేం కూడా కొడతాం’ లాంటి ఎన్నికల ప్రజాస్వామ్యానికి సంబంధం లేని కుస్తీ పట్ల కబుర్లు చెప్పారు. ఇక అటువైపు చూస్తే చంద్రబాబు వంటి అత్యంత అనుభవశాలి చేతికి అధికారం వచ్చింది. అభివృద్ధిపై ఆయన ఆలోచనలు, దూరదృష్టి ఎలా ఉంటుందో కళ్ళ ముందు కనుపిస్తున్న మచ్చుకు ఒక ఉదాహరణ సైబరాబాద్. రాజకీయాల కోసం ఎన్ని బుకాయింపులు చేసినా అది కాదనలేని వాస్తవం. అటువంటి చంద్రబాబు 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ప్రారంభించి అసలు ఎప్పటికైనా కోలుకోగలదా అనుకున్న రాష్ట్రాన్ని, అప్పటి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, వెంకయ్య గారి వంటి వారి సహకారంతో వినూత్నంగా ఆలోచనలతో సంక్షేమం, అభివృద్ధి, టెక్నాలజీ, వికేంద్రీకరణ వంటి నాలుగు కాళ్ళ మీద పరిగెత్తించి, మిగులు బడ్జెట్ తో ప్రారంభించీ, హైదరాబాద్ వంటి కల్పవృక్షం చేతిలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా అందుకోలేని విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. ఇటు తను చూస్తే పదుల సంఖ్యలో సిబిఐ, ఈడి ల కేసులతో దేశంలో అతిపెద్ద రాజకీయ అవనీతి కేసుల్లో ముద్దాయి. ఇలా తను చంద్రబాబు వంటి అనుభవశాలితో అభివృద్ధి, సంక్షేమం వంటి వాటిలో పోటీ పడలేమని గ్రహించిన జగన్ కాంప్ కి వచ్చిన ఆలోచన కాంగ్రెస్ మార్కు కులాల మద్య అంతరాలు సృష్టించడం. 1999లో ఓడిపోయిన తరువాత వైయస్ విజయవంతంగా వాడిన “ఒక సెక్షన్” అనే స్లో పాయిజన్ ని బయటకు తీసి వాడటం మెుదలు పెట్టారు.

ADVERTISEMENT

రాజధాని లేని రాష్ట్రంలో రైతులు పెద్ద మనసుతో రాజధాని కోసం ఇచ్చిన తమ జీననాధారమైన భూములతో మెుదలు పెట్టి ప్రతిదానినీ కులకోణంలో చూపించడం మెుదలు పెట్టారు, లేదంటే అవనీతి అని ముద్ర వేసారు. అమరావతి అంటే బాబు కులం కోసం అన్నారు, వేల కోట్ల దోపిడీ అన్నారు, పోలవరం అంటే బాబు కులపు కాంట్రాక్టరు, దోపిడీ అన్నారు, కియా అంటే అక్కడ బాబు కులపు నాయకుల దోపిడీ అన్నారు, అసలు లేని పింక్ డైమండ్ బాబు ఇంట్లోనే ఉంది అన్నారు. కోడికత్తి డ్రామాలాడి రెస్టారెంట్ ఓనర్ బాబు కులం అన్నారు. చివరకు సాక్షాత్తూ దేశ రాజధాని నడిబొడ్డున నిలబడి 37 మందిలో 35 మంది డియస్పీలు ఒకే కులం అని పచ్చి అబద్దం ఆడారు. ఇలా ఒకటేమిటి ఒకటి రెండు శాతం కూడా కమ్మవారు ఉండని శ్రీకాకుళం చోట కూడా వాళ్ళ మీద ప్రచారం చేసారు. ఈ ప్రచారానికి అక్రమ సంపాదనతో పెట్టారనే ఆరోపణలు ఉన్న జగన్ సొంత మీడియాతో పాటు, ఒక వర్గానికి చెందిన కొన్ని వెబ్సైట్లు, వెబ్ చానల్స్ ను విపరీతంగా వాడుకున్నారు.

ఇక వైసిపికి అండగా ఉండే ఒక వర్గం యువత తమ తోకలకు రంగులు మార్చి వేరే వర్గాల తోకలు పెట్టుకుని వాళ్ళను వీళ్ళు, వీళ్ళను వాళ్ళు దూషించి సోషల్ మీడియాల్లో ఫేక్ అకౌంట్లతో చేసిన కులచిచ్చు అంతా ఇంతా కాదు. ఇళ్ళలో మహిళ దగ్గర నుంచి అందరిని బూతులు తిడుతూ వాళ్ళ చేసిన ఉన్మాదపు పనులకు లెక్కలేదు. ముఖ్యంగా పల్నాడు నుంచి, కడప వరకు ఒక వర్గం వైసిపి కోసం వేలాదిగా సామాజిక మాద్యమాల అకౌంట్లు, వందల్లో యూట్యూబ్ చానల్స్ పెట్టి నిత్యం అబద్దాలు, కుల ద్వేషపు వార్తలతో ఊదరగొట్టారు. దీనికి కర్త జగన్ కోట్లు పెట్టి పెట్టుకున్న ప్రైవేట్ రాజకీయ స్ట్రాటజిస్ట్ అయితే, ఉత్ప్రైరకంగా పనిచేసింది అప్పట్లో చౌకగా వచ్చిపడిన సెల్ ఫోన్ ఇంటర్నెట్. వీటిని ఆలంబనగా చేసుకుని కమ్మవారి మీద చేసిన విష ప్రచారం, ఆ కులం మీద విద్వేషాలు రగిలించడంలో వైసిపి పూర్తిగా విజయవంతమైతే, వాటిని తిప్పికొట్టడంలో ఒక పార్టీగా టిడిపి కానీ, కులంగా కమ్మవారు గానీ పూర్తిగా విఫలమయ్యారు. ఆవిధంగా ఒక రకంగా జగన్ కు అధికారం రావడానికి కమ్మవారు సహాయపడ్డారని చెప్పవచ్చు. మూడున్నర దశాబ్దాల పార్టీ చరిత్రలో తొలిసారి తెలుగుదేశం నుంచి ఒక్క రెడ్డి వర్గ నాయకుడు కూడా యంయల్ఏ, యంపిగా ఎన్నికవలేదంటే ఈ ప్రచారం ఎంతగా కులద్వేషం రగిలించిందో ఊహించవచ్చు.

అలా అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తరువాతా కమ్మ వర్గం వారి మీద దాడి కొనసాగించారు, ఆ వర్గం అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టడం, ఏబి వెంకటేశ్వరరావు వంటి సీనియర్ అధికారుల మీద కేసులు పెట్టడం, నవయుగ, గీతం, ఈనాడు, వంటి ఆ వర్గపు వ్యాపారాలను, సంస్థలను వేదించడం, చివరికి రాజ్యాంగ బద్దమైన ఎలక్షన్ కమీషనర్ కు కూడా ముఖ్యమంత్రే కులం ఆపాదించడం వంటి ఈ రాష్ట్ర రాజకీయాలు ఎన్నడూ చూడని విష సంస్కృతికి తెరతీసారు. కరోనా కాలంలో దేశం గర్వపడే విదంగా దేశీయంగా అభివృద్ధి చేసి, కోట్ల ప్రాణాలు నిలిపిన కోవాక్సిన్ కి కూడా కులం అంటగట్టారంటే ఎలాంటి సంస్కృతికి పునాది వేసారో ఊహించవచ్చు. అలా మెదటి సంవత్సరంనర అందమైన కలలతో ఊరించిన జగన్ ప్రభుత్వం, పాత పధకాలనే పేరు మార్చి డబ్బు కొద్దిమంది లబ్ధిదారులకు అందించి అదే పరిపాలన అనే బ్రమల్లో ఉంచుతూ వచ్చింది. కానీ రానురానూ జగన్ రెడ్డిప్రభుత్వ విధానాల డొల్లతనం బయటపడటం మెుదలైంది. అమరావతిని కాదని తాము ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలున్న విశాఖ కేంద్రంగా మూడు రాజధానుల పేరుతో విచిత్రమైన విధానం మెుదలు, అభివృద్ధిలేమి, దారుణమైన రోడ్లు, నిరుద్యోగం, తలకుమించిన అప్పులు, దేవాలయాలు, దళితులపై దాడులు, సిబిఐ కేసులు, డిల్లీ ప్రదక్షిణలతో ఓపక్క పుణ్యకాలం పూర్తవడానికి దగ్గరగా ఉంటే, మరో పక్క తాను, తన వందిమాగదులు కమ్మవారిపై చేసిన దుష్ప్రచారాలు అన్నీ బయటపడటం మెుదలైంది. అమరావతిలో అందరూ కమ్మవారే అని చెప్పిన అబద్దాలు సంఖ్యలతో సహా బయటపడ్డాయి. అక్కడ కమ్మవారి కంటే జగన్ సొంత వర్గమే ఎక్కువ అని, దళిత, బిసిల భూములు, చిన్న, సన్నకారు రైతుల భూములే ఎక్కువ అని లెక్కలు బయటపడ్డాయి. మూడు రాజధానులని మూడేళ్ళైనా ఒక అడుగు ముందుకు, మూడడుగులు వెనక్కిలాగా ఉంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని ప్రచారం చేస్తే విశాఖలో అధికార పార్టీ పెద్దలు సంపాదించిన 40 వేల కోట్ల భూముల వివరాలు బయటకు వచ్చాయి. పింక్ డైమండ్ అని అల్లరి చేసి, ఆ కేసు అధికారంలోకి వచ్చాక అటువంటిది లేదని సాక్షాత్తూ జగన్ బాబాయి సుబ్బారెడ్డి నేతృత్వంలో ని టిటిడి చెప్పింది. ఇక చంద్రబాబే చేపించాడని చెప్పిన వివేకా హత్య కేసులో దర్యాప్తు జగన్ సొంత బంధువుల చుట్టూ తిరుగుతుంది, పోలవరం నవయుగ నుంచి లాగేసి తనకు దగ్గరగా ఉండే మేఘాకు కట్టబెట్టినా మూడేళ్ళలో కనీసం 5 శాతం కూడా పూర్తి చెయ్యలేదు. ఇక 37 మంది డియస్పీల కధలో జగన్ ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా అది అబద్దం అని చెప్పింది. ఇక కోడికత్తి కేసులో అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటైన యన్ఐఏ కుట్ర లేదని చెబుతూ, విశాఖ ఏర్పోర్ట్ రెస్టారెంట్ యజమాని పేరులో లేని కులాన్ని జగన్ రెడ్డి కావాలనే చెప్పారనే విదంగా రిపోర్టు ఇచ్చి అప్పటి ప్రతిపక్ష పార్టీ గోబెల్స్ ని ఎలా ప్రచారం చేసిందనే విషయం తెల్లతేటం చేసింది.

ఇలాంటి సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం నాలుగు యంయల్సీ స్థానాలు గెలవడం, లోకేష్, చంద్రబాబు యాత్రలు, సభలకు తొక్కిసలాట జరిగేంతగా జనాలు పోటెత్తడం అధికార పెద్దల గుండెల్లో గుబులు రేపింది. అప్పటి వరకు 175 స్థానాలు మావే అని హుంకరించిన జగన్, మిమ్మల్నే నమ్ముకున్నా అని దీనంగా అడిగే పరిస్ధితికి వచ్చారు. ఇక పరిస్థితి చేజారుతుందని అర్దమౌతున్న తరుణంలో మళ్ళీ కమ్మ వారినే బూచిగా చూడాలనే పాత వ్యూహం బయటకు తీసారు. అందులో భాగంగానే ఎప్పుడో జరిగిన నంది అవార్డులను ఇప్పుడు వివాదాలుగా మార్చాలని చూడటం, సోషల్ మీడియాల్లో జనసేన, టిడిపి అభిమానుల పేరుతో కులాల మద్య గొడవ పెట్టాలని చూడటం, మార్ఫింగ్ వీడియెూలతో లోకేష్ దళితులను అవమానించారని చెప్పడం, మార్గదర్శి పేరు మీద ఆ వర్గం మీద రకరకాల వేదికల మీద నుంచి విషం చిమ్మించడం, ఇలా మళ్ళీ తన ఫెయల్యూర్ని కమ్మవారి మీద ద్వేషంగా మార్చాలనే పాత చింతకాయ ప్లాన్‌తో బయలుదేరారు. కానీ నాలుగేళ్ళుగా ఓ పక్క వేలాదిగా సొంత వారికి పదవులు, పోస్టింగులు, కాంట్రాక్టులు ఇస్తూ, గతంలో చేసిన ఆరోపణలన్ని అబద్దాలుగా నిరూపణ అవుతూ, కక్షలు, ప్రతీకారాల పేరిట నేలబారు పరిపాలన నడిపిస్తూ తనే జనాలకు ప్రతిపక్షాలవైపు వెళ్ళే పరిస్ధితి తెచ్చిన జగన్ కమ్మవారి ని బూచిగా చూపిస్తూ 2024 ఎన్నికలు దాటగలరా? ఇప్పటికే జగన్ కార్యకర్తలు మద్దతుదార్లు విష ప్రచారం చేసినా కోవాక్జిన్ అత్యంత నమ్మకమైన వాక్సిన్ గా పేరు పొందితే, మార్గదర్శి మీద వైయస్ కంటే శృతిమించి దాడులు చేస్తున్నా ఖాతాదారుల నమ్మకం సడలకపోవడం జగన్ అండ్ కో, ప్రచారాలు పలచబడ్డాయనే సంకేతాలు వచ్చాయనుకోవాలి. ఇలాంటి పరిస్ధితుల్లో 2019లో లా మరోసారి కమ్మ వారి మీద ద్వేషం రగిలించి చలి కాసుకోవాలి అనే వాడుతున్న కార్డ్ ఆదుకుంటుంది అనే ఆశలు అడుగంటుతున్నాయి అన్న ఆందోళన వైసీపీ లో కూడా కనపడుతుంది

ADVERTISEMENT
Latest Stories