ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఓ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నుండి ‘పే రివిజన్’ ప్రకటన వస్తుందా… జీతాలు పెరుగుతాయని ఎదురుచూసే ఉద్యోగుల చేత ఈ ‘పే రివిజన్’ మాకొద్దు బాబోయ్ అంటూ దండాలు పెట్టేలా చేయడంలో ఓ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి ఎవరూ సాటిరారు.
గత చరిత్ర చూసుకున్నా… భవిష్యత్తులో మరెవరైనా గానీ… ఉద్యోగులను ఈ స్థాయికి తీసుకు రాకపోవచ్చు. ఇటీవల పీఆర్సీ ప్రకటన చేయగానే, ‘మేము ఎన్నుకున్న సీఎం గ్రేట్, తోపు అన్న ఉద్యోగ సంఘ నేతలే, నేడు ఇంత అన్యాయం ఏ ప్రభుత్వము చేయలేదు, ఈ పీఆర్సీ రద్దు చేసే వరకు అవసరమైతే ఉద్యమం చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు.
స్టోరీ ఇక్కడితో ఆగలేదు, ఆర్ధికంగా ఏపీ సరైన స్థితిలో లేదు గనుక, అప్పటివరకు పాత పీఆర్సీనే అమలు చేయాలని, ఆర్ధికంగా బలపడిన తర్వాతే కొత్త పీఆర్సీని రూపొందించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారంటే, ఉద్యోగుల జీతభత్యాలను జగన్ సర్కార్ ఏ విధంగా రూపొందించిందో అర్ధం చేసుకోవచ్చు. పీఆర్సీకి ముందు 49 వేలు ఉన్న జీతం, పీఆర్సీ తర్వాత 47 వేలు అయితే ఉద్యోగుల రోదనకు అంతు ఎక్కడ ఉంటుంది?
అయినా పీఆర్సీ అంటే ఏదైనా జీతం పెరగాలని గానీ, తగ్గడమేంటో ఉద్యోగులకే అర్ధం కావట్లేదు. ఈ విషయం తెలియక ముందే పండగ చేసుకున్న ఉద్యోగులకు మొదటి నెల జీతం వచ్చేపాటికి షాక్ తగిలినట్లయింది. ఇక్కడే జగన్ మోహన్ రెడ్డి యొక్క ఆర్ధిక నైపుణ్యత గురించి ప్రస్తావించుకోవాలి. కొన్ని వేల కోట్లకు సంబంధించిన కేసులు జగన్ పై ఈడీ నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులలో వందల కోట్లను జగన్ నుండి ఈడీ అటాచ్ చేసింది. ఇంకా చాలా కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఈడీ వంటి సంస్థలకే చుక్కలు చూపించిన జగన్ మరియు విజయసాయిరెడ్డిలు, ఉద్యోగులకు అర్ధం కాని రీతిలో తిమ్మిని బమ్మిని చేసి పీఆర్సీని రూపొందించడం ఓ లెక్కా? అన్న విశ్లేషణలు ఈ సందర్భంగా వెలుగు చూస్తున్నాయి.
ప్రస్తుతం జారీ చేసిన పీఆర్సీని రద్దు చేసి, అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను బయటపెట్టి, పాత పద్ధతిలోనే హెచ్ఆర్ఏ ఇవ్వాలనేది ఉద్యోగ సంఘాల డిమాండ్. లేని పక్షంలో సమ్మెకు సైతం వెనుకాడబోమని జగన్ ను ఆకాశంలోకి ఎత్తేసిన ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు స్వయంగా చెప్పిన సంగతి. ముందుగా దశల వారీ నిరసనలు తెలియజేసే కార్యాచరణ అయితే చేస్తున్నారు.
స్వతంత్ర భారతదేశంలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫైనల్ రిలీఫ్ తగ్గడం అన్నది మరొకడి వల్ల కాదు. ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేయాలంటే ఎంతో కంపాషనేట్ గా, అసలు చేతికి ఎముక లేని, నాలుకకు నరం లేని వ్యక్తి వల్లే సాధ్యమని నిరూపణ అయ్యిందంటూ రఘురామకృష్ణంరాజు చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://twitter.com/nodrama5678/status/1483464679276298241



