కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి, గ్రూపులు కట్టడం, సిఎంపై అధిష్టానానికి పిర్యాదులు చేయడం, అప్పుడు ముఖ్యమంత్రులను మార్చడం పరిపాటి అని చెప్పక తప్పదు.
ఇందుకు తాజా నిదర్శనంగా కర్ణాటక సిఎం సిద్ధరామయ్య గురువారం రాజీనామా చేస్తారని, మే 30న కొత్త సిఎం ప్రమాణ స్వీకారం చేస్తారని వస్తున్న వార్తలు కనిపిస్తున్నాయి.
కర్ణాటకలో రెండున్నరేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే సిఎం పదవికి డీకే శివకుమార్ పోటీ పడ్డారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యని సిఎం చేసింది. అప్పటి నుంచి డీకే శివకుమార్ అసంతృప్తితో రగిలిపోతూనే ఉన్నారు.
సిద్ధరామయ్య రెండున్నరేళ్ళు సిఎం పదవిలో ఉన్నారు కనుక మిగిలిన రెండున్నరేళ్ళు తనకు సిఎంగా అవకాశం ఇవ్వలని డీకే శివకుమార్ పట్టుబట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంతో సిఎం సిద్ధరామయ్య రాజీనామా, కొత్త సిఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం అంటూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చాలా హడావుడి జరుగుతోంది.
సిఎం పదవిని అయిష్టంగానే వదులుకోవడానికి సిద్దపడిన సిద్ధరామయ్య ఆ కుర్చీలో తన అనుచరుడు జి.పరమేశ్వరని కూర్చోబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన దళిత నాయకుడు ‘ఆహింద’ వర్గానికి చెందిన జి.పరమేశ్వరని సిఎంగా నియమిస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆ వర్గం ఓట్లు సాధించి పెడతారని సిఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానానికి నచ్చజెపుతున్నట్లు తెలుస్తోంది.
కానీ అప్పుడు మళ్ళీ డీకే శివకుమార్, ఆయన వర్గం అసంతృప్తితో రగిలిపోతారు. అది పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. కనుక ఆయనకే సిఎం పదవి కట్టబెట్టవచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు చేస్తున్న డీకే శివకుమార్, గురువారం ఉదయం బెంగళూరు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా సిఎం సిద్ధరామయ్య నివాసానికి వెళ్ళి భేటీ అవుతారని సమాచారం.
కనుక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సిఎం మార్పిడి జరగడం ఖాయమే అనిపిస్తోంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి సిఎం మార్పు గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.




