సర్వసాధారణంగా నాయకుల రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసమే కొత్త పార్టీలు పుడుతుంటాయి. అలాగే రాజకీయ శూన్యత, కొన్ని శక్తుల కలయికతో కూడా పార్టీలు పుట్టుకొస్తుంటాయి. చాలా అరుదుగా రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు అవిర్భవిస్తుంటాయి.
స్వాతంత్ర్య పోరాటాల కొరకు కాంగ్రెస్, సమ సమాజ స్థాపన కోసం వామపక్షాలు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపి, తెలంగాణ సాధన కొరకు టిఆర్ఎస్, ఏపీ రాజకీయాలలో మార్పు కోసం జనసేన వంటి పార్టీలు ఉద్భవించాయి.
తమిళనాడులో కరుణానిధి, జయలలిత శకం ముగిసిన తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడటంతో దానిని అవకాశంగా మలుచుకోవడానికి కమల్ హాసన్, విజయ్ దళపతి ఇంకా పలువురు పార్టీలు పెట్టుకున్నారు.
నాయకుల రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసమే పుట్టిన వైసీపీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ వంటివే దేశంలో ఎక్కువున్నాయి.
అలాగే ఒకప్పుడు ఒక ప్రత్యేక లక్ష్యంతో ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీయే ఆ తర్వాత కేసీఆర్ జాతీయ కలలు నిజం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే.
కనుక ప్రజల కోసం పార్టీ ఏర్పాటు చేయడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పవచ్చు. కానీ ప్రజలు కోరుకుంటే వారి కోసమే రాజకీయ పార్టీ స్థాపిస్తానని కల్వకుంట్ల కవిత చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఒకవేళ ఆమె బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఉండి ఉంటే ఇటువంటి ఆలోచన, అవసరం కలిగేదే కాదు కదా? కానీ బయటకు వచ్చిన తర్వాత ఆమె రాష్ట్ర రాజకీయాలలో కొనసాగాలని గట్టిగా కోరుకొంటున్నారు. కానీ కాంగ్రెస్, బీజేపి లేదా మరో పార్టీలో చేరి చేతులు కట్టుకొని నిలబడలేరు.
కనుకనే తెలంగాణ జాగృతి కండువా వేసుకొని ‘సామాజిక న్యాయం’ కోసం ప్రజల వద్దకు బయలుదేరుతున్నారు. నాలుగు నెలల పాటు సాగే ‘జాగృతి జనం బాట’ యాత్ర ఆమె కొత్త పార్టీ నిర్మాణం కోసమేనని నిన్న ఆమె మాట్లాడిన మాటలతో స్పష్టమైంది. జగన్ కూడా ఇలాగే ‘ఓదార్పు యాత్ర’ పేరుతో వైసీపీని నిర్మించుకున్న సంగతి తెలిసిందే.
కనుక ప్రజలు కోరిక మేర పార్టీ అనే మాట పచ్చి అబద్దమే. అసలు ప్రజలు ఎన్నడూ ఏ నాయకుడిని పార్టీ పెట్టమని అడగరు. వారే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అవకాశాలు, ఆర్ధిక, రాజకీయ, సామాజిక సమీకరణాల లెక్కలు కట్టుకొని అధికారమే లక్ష్యంగా పార్టీలు స్థాపిస్తుంటారు. తమ ఆశలు, కోర్కెలు, అభిప్రాయాలను ప్రజలవిగా అభివర్ణిస్తుంటారు. ప్రజలను ప్రభావితం చేసి పార్టీని సుస్థిరం చేసుకుంటారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఒకప్పుడు ప్రజలు, రాష్ట్రం లేదా దేశం కోసమే పార్టీలు ఏర్పడేవి. కానీ ఇప్పుడు చాలా వరకు నాయకుల రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసమే పార్టీలు ఏర్పటవుతున్నాయి. ఒకవేళ కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే అది కూడా ఇటువంటిదే అవుతుంది తప్ప ప్రజలను ఉద్దరించడం కొరకు కాదని చెప్పక తప్పదు.







