నాడు కేసీఆర్‌, నేడు రేవంత్ అవినీతి.. తర్వాత?

Kavitha’s Remarks on Pawan Kalyan Spark Political Debate

సినిమా రివ్యూలు వ్రాసేవారందరూ సినిమాలు చూసి రాయరు. ఇతరులు వ్రాసిన ఓ నాలుగైదు రివ్యూలు ముందేసుకొని మరో రివ్యూ వ్రాసేస్తుంటారు కొందరు.

జనసేనాని పవన్ కళ్యాణ్‌ ప్రసంగం, దానిపై అన్ని పార్టీలు, తెలంగాణ వాదులు మాట్లాడిన మాటలన్నీ విన్నాక టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడటం చూస్తే అలాగే అనిపిస్తుంది. అందరి కంటే ముందు ఏదేదో మాట్లాడేయడం కంటే అందరూ మాట్లాడిన తర్వాత వాటిలో పాయింట్స్ తీసుకొని మాట్లాడటం సేఫ్ గేమ్‌ అని ఆమె అనుకొని ఉండవచ్చు.

ADVERTISEMENT

“జనసేన తెలంగాణలో పోటీ చేయోచ్చు” అంటూనే మీ రాష్ట్రంలో ప్రజలు, పేదవాళ్ళు లేరా? అక్కడ పోటీ చేసుకోవచ్చు కదా? ఇక్కడెందుకు? ఇక్కడ మాకు చాలా పార్టీలు, నాయకులు ఉన్నారు. మా రాష్ట్రం సంగతి మేము చూసుకుంటాము. మద్యలో మీకెందుకు ఈ శ్రమ? అని అన్నారు.

అంతకు ముందు ఆమె మరో మాట అన్నారు. “కేసీఆర్‌ హయంలో అవినీతికి కిటికీలు తెరిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఏకంగా బార్లా తలుపులు తెరిచేసి లక్ష కోట్లు కొట్టేస్తోంది. నాడు కేటీఆర్‌ అంటే కేసీఆర్‌, హరీష్‌ రావు, రామారావు అన్నట్లు అవినీతి పాలన సాగేది. నేడు కేటీఆర్‌ స్థానంలో రేవంత్ రెడ్డి, కొండల్‌ రెడ్డి, తిరుపతి రెడ్డి అన్నట్లు అవినీతి పాలన సాగుతోంది.

నాడు కేసీఆర్‌ హయంలో అవినీతి జరిగింది. నేడు రేవంత్ రెడ్డి హయంలో ఇంకా భారీగా అవినీతి జరుగుతోంది. అందరూ తెలంగాణ మీదపడి దోచుకునేటోళ్ళే తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన ఒక్కరికీ లేదు,” అని అన్నారు.

తండ్రి కేసీఆర్‌ హయంలో అవినీతి జరిగిందని ఆమె స్వయంగా చెపుతున్నారు. ఆ కుటుంబంలో, పార్టీలో, ప్రభుత్వంలో ఆమె కూడా ఉన్నారు. కనుక తనకు ఆ అవినీతితో తనకు సంబంధం లేదని ఆమె చెప్పలేరు. చెప్పినా ఎవరూ నమ్మరు.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో ఆమె అరెస్ట్ అయ్యి ఆరు నెలలు తిహార్ జైల్లో ఉన్నారు కదా? బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీలు అవినీతికి పాల్పడి తెలంగాణని దోచుకు తిన్నాయని ఆరోపిస్తున్న ఆమె ఇప్పుడు టీఆర్ఎస్‌ పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? ప్రజలకు సేవ చేయడానికే అయితే పవన్ కళ్యాణ్‌ లేదా మరొకరు పోటీకి వస్తే స్వాగతించాలి కదా? కానీ ఎందుకు వద్దంటున్నారు?

“వర్షం చినుకు పడితే అమరావతిలో బోట్లు వేసుకొని తిరిగే పరిస్థితి ఉందంటూ” ఆమె మళ్ళీ వెటకారంగా మాట్లాడారు. దీనిని బట్టి ఆమె కూడా అమరావతి గురించి వైసీపీ చెపుతున్నవాటినే గుడ్డిగా ఫాలో అయిపోతున్నట్లనిపిస్తోంది.

ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకునే హైదరాబాద్‌లోనే కాస్త వర్షం పడితే రోడ్లపై కార్లు, స్కూటీలు, చివరికి మనుషులు కూడా కాలువలలో కొట్టుకుపోతుంటారనే సంగతి ఆమెకు తెలియదా? కేసీఆర్‌ సిఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో వరదలొచ్చి మునిగిపోతే వరదబాధితులకు పది వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించిన సంగతి ఆమెకు తెలియదా?

కానీ నిర్మాణంలో ఉన్న అమరావతి అటువంటి పరిస్థితి లేనే లేదు. కావాలంటే వర్షాకాలంలోనే ఆమె అమరావతిలో పర్యటించి ఎక్కడెక్కడ బొట్లు వాడుతున్నారో ఫోటోలు తీసి చూపిస్తే బాగుంటుంది.

తెలంగాణలో ఆమెను, టీఆర్ఎస్‌ పార్టీని ఆమె తండ్రి కేసీఆర్‌, అన్న కేటీఆర్‌, సిఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌ పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు. అసలు టీఆర్ఎస్‌ అనే ఓ పార్టీ ఉందని ఎవరూ గుర్తించడం లేదు.

కనుకనే ఆమె కూడా తండ్రి, అన్న బాటలోనే తెలంగాణ సెంటిమెంట్‌ని ఆయుధంగా మార్చుకొని మనుగడ కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నట్లు అర్ధమవుతూనే ఉంది.

కానీ ఎన్నికల నాటికి లేదా తర్వాత ఆమె తండ్రి పంచన చేరకుండా ఉంటారా? టీఆర్ఎస్‌ బీఆర్ఎస్‌ పార్టీలో విలీనం కాకుండా ఉంటుందా? అలా కాకూడదనుకుంటే తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసుకుంటే మంచిది కదా?

ADVERTISEMENT
Latest Stories