
కేసీఆర్ ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత ఓ మధ్యవర్తి ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం జరిపినట్లు ప్రముఖ తెలుగు మీడియా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ సంచలన వార్త ప్రచురించింది.
Also Read – బిఆర్ఎస్ బతకాలి అంటే ఏపీ చావాలా.?
తనకు మంత్రి పదవి ఇస్తే కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని దాని సారాంశం.
కాంగ్రెస్ అధిష్టానం ఆమెను చేర్చుకోవడానికి సిద్దపడిందని, కానీ సిఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలపడంతో ఆ ఆలోచన విరమించుకుందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
Also Read – లోకేష్‌కు ప్రధాని మోడీ అభినందనలు.. మరో మెట్టు ఎక్కినట్లే!
ఆమె కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం జరిపారనేందుకు తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
దీనిని ఆమె ఫేక్ న్యూస్ అని ఖండించినప్పటికీ, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఆమె స్టాండర్డ్ డైలాగ్ చెప్పకపోవడం గమనార్హం.
Also Read – శ్యామల చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి..!
మరోపక్క నేను నా తండ్రికి వ్రాసిన లేఖని మీడియాకు ఎవరు లీక్ చేశారు? అనే ఆమె ప్రశ్నకు, ‘తండ్రి చుట్టూ కొన్ని దెయ్యాలు తిరుగుతున్నాయంటూ’ ఆమె చేసిన విమర్శలపై ఇంత వరకు కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.
కవిత లేఖ, విమర్శల తర్వాత కేసీఆర్ తరపున ఇద్దరు సీనియర్లు ఆమె వద్దకు వెళ్ళి రాజీకి ప్రయత్నించారని, కానీ పార్టీలో తన రాజకీయ భవిష్యత్‌కు గ్యారెంటీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేయడంతో వారి మధ్యవర్తిత్వం విఫలం అయ్యిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
వెంటనే ఆమె సింగరేణి బొగ్గు గనులలో గల 11 ఏరియాలలోని బిఆర్ఎస్ అనుబంద సంఘాల నేతలతో సమావేశమయ్యి ‘సింగరేణి జాగృతి’ని ఏర్పాటు చేశారని పేర్కొంది.
కనుక ఇటు కవిత, అటు కేసీఆర్ ఇద్దరూ కూడా రాజీకి సిద్దంగా లేరనే విషయం స్పష్టమయింది. కనుక ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారనే ఆంధ్రజ్యోతి వార్తలో ఎంతో కొంత నిజం ఉందనే భావించవచ్చు.
‘మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమని’ ఆమె ప్రతిపాదన చేయడం నిజమే అయితే, ఆమెలో ఆ అసంతృప్తి చాలా కాలంగా ఉందని స్పష్టమవుతుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె ‘తెలంగాణ జాగృతి’ ద్వారా ‘బతుకమ్మ వేడుకలు’ నిర్వహిస్తూ వాటిలో తెలంగాణ మహిళలందరూ పాల్గొనేలా చేసి, వారిలో చైతన్యం కలిగించి, వారు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలలో పాల్గొనేలా చేశారు. కనుక తెలంగాణ ఉద్యమాలలో కల్వకుంట్ల కవితది చాలా కీలకపాత్ర అని చెప్పవచ్చు.
కానీ తండ్రి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనను తప్పకుండా మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆమె ఆశించడం అత్యాశ కాదు.
కానీ మొదటి ప్రభుత్వంలో మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోలేదు కనుక ఆమె సర్దుకుపోయారు. కేసీఆర్ మళ్ళీ రెండోసారి సిఎం అయినప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని, బిఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల కవిత కంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నవారికీ అవకాశం ఇచ్చారు తప్ప ఆమెకు ఇవ్వలేదు!
సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆమె లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచే పార్టీలో ఆమె ప్రాధాన్యం తగ్గడం మొదలైంది. కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీ సీటుతో సరిపెట్టారు.
కానీ ఆ తర్వాత ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు పాలయ్యారు. ఆ కారణంగానే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే కేసీఆర్ కోరిక నెరవేర్చుకోలేకపోయారు. పైగా బిఆర్ఎస్ పార్టీపై కూడా ఆ ప్రభావం పడింది.
కనుక కూతురు కారణంగానే తనకు, బిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయని కేసీఆర్ భావించడం సహజం. కానీ ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన తనను చుట్టూ ఉన్న దెయ్యాల చెప్పుడు మాటలు విని తండ్రి తన పట్ల వివక్ష చూపిస్తూ ఎదగనీయకుండా తొక్కేశారని ఆమె కూడా ఆవేదన చెందడం సహజం.
కనుక ఆమె తీహార్ జైలు నుంచి విడుదలై తిరిగి వచ్చిన తర్వాత తన బలం పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆమెకు బిఆర్ఎస్ పార్టీ సహకరించలేదు. అప్పటి నుంచే ఆమెలో తండ్రి పట్ల విముఖత ఏర్పడింది. తండ్రీ, కూతుర్ల మద్య క్రమంగా ఆ దూరం పెరిగి గులాబీ సభ తర్వాత విస్పోటనాలు మొదలయ్యాయి.
కనుక కేసీఆర్ కూతురుకి నచ్చజెప్పుకుంటారా లేదా పార్టీ నుంచి బహిష్కరిస్తారా? కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీలో సర్దుకుపోతారా లేదా?అనే విషయాలు రాబోయే రోజుల్లో అందరూ చూస్తారు.