
రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసినవారు శాసనసభ సమావేశాలకు హాజరైతే అదో సంచలన వార్తగా మారుతోంది. ఈసారైనా వారు శాసనసభ సమావేశాలకు వస్తారా రారా? అనే చర్చ నడుస్తుంది తప్ప ఎందుకు రావడం లేదు? రాకపోతే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి?అనే చర్చలు జరుగవు.
ఏపీలో జగన్ తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వనందునే శాసనసభ సమావేశాలకు రావడం లేదని ఓ కుంటిసాకు చెపుతున్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ ఏ కారణం చెప్పకుండానే మొహం చాటేస్తున్నారు.
Also Read – పడి లేచిన కెరటం .. జనసేన ..
ఈ నెల 12 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. కనుక మార్చి 11న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారని ఆ పార్టీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కానీ ఈసారి కేసీఆర్ శాసనసభకు రాబోతున్నారా లేదా?అనే విషయం మాత్రం తెలియజేయలేదు.
ఇక్కడ ఏపీలో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి శాసనసభకు రాకపోతే నిబంధనల ప్రకారం వారిపై అనర్హత వేటువేసి వారి సీట్లు ఖాళీ అయిన్నట్లు ప్రకటిస్తామని స్పీకర్, డెప్యూటీ స్పీకర్ పదేపదే హెచ్చరించారు. అందువలే జగన్, పది మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని వచ్చి హాజరు వేయించుకొని, గవర్నర్ ప్రసంగిస్తుండగానే పారిపోయారు.
Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?
శాసనసభకు రాకపోతే కేసీఆర్‌పై వేటు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదు. కానీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆయన నిరవధికంగా శాసనసభకు డుమ్మా కొడుతున్నారు కనుక ఆయన శాసనసభ్యత్వం రద్దు చేయాలని ఆ పిటిషన్ సారాంశం. బహుశః ఆ భయంతోనే కేసీఆర్ హాజరు వేసుకొని వెళ్ళేందుకు శాసనసభకు రాబోతున్నారా?
లేక కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధ, అవినీతి పాలనతో రాష్ట్ర ప్రజలు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీవైపు చూస్తున్నారని కేసీఆర్ చెప్పుకుంటున్నారు కనుక, రాజకీయాలలో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ఇదే తగిన సమయమని భావించి కేసీఆర్ శాసనసభకు వస్తున్నారా?
Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?
లేదా ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ రెండు చోట్ల ఓడిపోయి, బీజేపి గెలిచించింది కనుక ఆయన అహం చల్లబడి వస్తున్నారా?అనే ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి వారు చెప్పుకోవలసిందే!
ఏది ఏమైనప్పటికీ ఒకవేళ కేసీఆర్ శాసనసభకు వస్తే, ఆయనను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ మంత్రులకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ రాకుండా మళ్ళీ మొహం చాటేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఉపశమనం లభిస్తుంది. శాసనసభకు రానందుకు కేసీఆర్‌ని విమర్శించగలుగుతుంది కూడా.