అక్కడ కుమారస్వామి.. ఇక్కడ తోట చంద్రశేఖర్‌…పాపం!

KCR-BRS-Delhi-Officeతెలంగాణ సిఎం కేసీఆర్‌ ఎప్పుడు హడావుడి చేస్తారో, ఎప్పుడు, ఎందుకు సైలంట్ అయిపోతారో ఎవరికీ తెలీదు. బిఆర్ఎస్‌ పార్టీని చూసి ప్రధాని నరేంద్రమోడీ గడగడలాడిపోతున్నారని, ఆయనను తానే గద్దె దించి ఆ కుర్చీలో కూర్చొని దేశాన్ని పాలిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌, తన సత్తా చాటుకొనేందుకు కర్ణాటక శాసనసభ ఎన్నికలతో అవకాశం రాగా అటువైపు కనీసం తొంగిచూడలేదు!

కర్ణాటక నుంచే జాతీయ రాజకీయాలలోకి ఆరంగ్రేటం చేస్తామని, కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టే బాధ్యత తనదేనని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ దేవగౌడ ఆయన కుమారుడు కుమారస్వామి ఎన్నికల ప్రచారానికి రావాలని, నిధులు అందించి తోడ్పడాలని వేడుకొన్నా కేసీఆర్‌ కిమ్మనలేదు! దాంతో ముఖ్యమంత్రి అవుదామని కలలుగన్న కుమారస్వామి రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. కర్ణాటకలో కాంగ్రెస్‌, బిజెపిల తర్వాత మూడోస్థానంలో జేడీఎస్ పార్టీ మిగిలిపోయింది.

ADVERTISEMENT

కర్ణాటకలో కుమారస్వామిని ఎగదోసిన్నట్లే కేసీఆర్‌ ఏపీలో తోట చంద్రశేఖర్‌ను బిఆర్ఎస్‌ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించి ఎగదోశారు. దాంతో ఆయన ఏపీలో నాయకులందరూ, ముఖ్యంగా కాపు నాయకులందరూ తమ బిఆర్ఎస్‌ పార్టీలోకి క్యూ కడతారని కలలు కన్నారు. ఈలోగా సిఎం కేసీఆర్‌ విజయవాడలోనో విశాఖలోనో భారీ బహిరంగసభ నిర్వహిస్తారని కూడా ఎదురుచూపులు చూశారు. కానీ కేసీఆర్‌, ఆయన మంత్రులు అటు… మహారాష్ట్రవైపు వెళుతున్నారే కానీ ఏపీ వైపు తొంగి చూడటం లేదు!!!

ఆ మద్య వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని కాపాడేస్తానంటూ ‘కేసీఆర్‌ బ్రో’ హడావుడి చేయడంతో చంద్రశేఖర్‌ కూడా ఇక తన తోటలో గులాబీలు విరగపూస్తాయనుకొన్నారు. కానీ ఆ విషయంలో కూడా కేసీఆర్‌ హటాత్తుగా సైలంట్ అయిపోయారు. దీంతో హైదరాబాద్‌ వెళ్ళి బిఆర్ఎస్‌ కండువా కప్పుకొని వచ్చిన తోట చంద్రశేఖర్‌ తదితరుల పరిస్థితి అయోమయంగా మారింది.

కానీ అటో… ఇటో… ఎటో… ఓ దిశలో వారు అడుగులు వేశారు కనుక గుంటూరులో బిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం సిద్దం చేసుకొని దాని ప్రారంభోత్సవానికైనా కేసీఆర్‌ వస్తారేమో అని ఎదురు చూశారు. కానీ కేసీఆర్‌ ఎక్కడో ఢిల్లీలో నిర్మించుకొన్న బిఆర్ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్ళారు కానీ పక్కనే గుంటూరులో కార్యాలయ ప్రారంభోత్సవానికి రాలేకపోతున్నట్లు తాజా సమాచారం!!!

కనీసం తన మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, భీమవరం రొయ్యల పులుసు చాలా ఇష్టపడే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌నైనా పంపించలేకపోతున్నారని తెలుస్తోంది. కనుక ఈ నెల 21న తోట చంద్రశేఖర్‌, తనతో హైదరాబాద్‌ వచ్చి బిఆర్ఎస్‌ కండువాలు కప్పుకొన్న మిగిలినవారితో కలిసి గుంటూరులో బిఆర్ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవం చేయబోతున్నట్లు సమాచారం.

అక్కడ కర్ణాటకలో కుమారస్వామి… ఇక్కడ ఏపీలో తోట చంద్రశేఖర్‌… పాపం… కేసీఆర్‌ని నమ్ముకొని మునిగిపోతున్నారు కదా!

ADVERTISEMENT
Latest Stories