కేసీఆర్‌ తన శత్రువును మార్చుకొంటున్నారా?

KCR-Kishan-Reddy-Revanth-Reddyకర్ణాటకలో బిజెపిని ఓడించి అధికారంలోకి రావడంతో ఆ స్పూర్తితో తెలంగాణ కాంగ్రెస్‌ కూడా బాగానే పుంజుకొంది. ఇంతకాలం కేసీఆర్‌తో ఏదో పోరాడాలి గాబట్టి పోరాడుతున్నమన్నట్లు పోరాడే కాంగ్రెస్‌ నేతలు ఒక్కసారిగా నిద్రలేచి జూలు విదిలించుకొని యుద్ధానికి సిద్దమైపోయారు.

సరిగ్గా ఇక్కడే కేసీఆర్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తూ గతంలో తాను చేసిన తప్పును సరిదిద్దుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన వెంటనే తన రాజకీయ శత్రువును మార్చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో తనంతట తానుగా అధికారంలోకి రాలేని పరిస్థితిలో ఉండి, అంతర్గత కలహాలు, నాయకత్వలోపంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ తనకు శత్రువుగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

ADVERTISEMENT

బహుశః అందుకేనేమో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ‘వ్యవసాయానికి 8 గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చాలు’ అనే చిన్న మాటను పట్టుకొని మూడు రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది.

అయితే అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా?రేవంత్‌ రెడ్డి ఏదో చెపితే అది నిజంగా జరిగిపోతుందా?అని ఆలోచిస్తే బిఆర్ఎస్ ఆందోళనలు ఎంత అర్దరహితమో అర్దమవుతాయి. ఈవిషయం అపర చాణక్యుడు అయిన కేసీఆర్‌కు, దేశముదురు బిఆర్ఎస్ మంత్రులకు తెలియదనుకోలేము. కనుక బిజెపి నేతలు ఆరోపిస్తున్నట్లు కేసీఆర్‌ స్వయంగా కాంగ్రెస్‌ పార్టీని జాకీలు పెట్టి లేపేందుకు ప్రయత్నిస్తున్నారని భావించవచ్చు.

అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా ఓ గొప్ప లక్షణం ఉంది. అది తనను తాను ఓడించుకొంటే తప్ప ఎవరూ దానిని ఓడించలేరు. కర్ణాటకలో అందరూ కలిసి పనిచేసి కాంగ్రెస్‌ను గెలిపించుకొన్నారు. తెలంగాణలో కూడా అలాగే చేయాలనుకొన్నారు. కానీ కలవలేకపోతున్నారు.

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై బిఆర్ఎస్‌ పార్టీ తమను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే, సీనియర్ కాంగ్రెస్‌ నేతలందరూ దానిని ధీటుగా ఎదుర్కొని తమ పార్టీని, తమ అధినేత రేవంత్‌ రెడ్డిని కాపాడుకోవలసి ఉండగా, ఆయన మీద ద్వేషంతో అందరూ ప్రేక్షకులుగా చోద్యం చూశారు.

తద్వారా వారు కేసీఆర్‌ తమపై పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేయమని నిరూపించుకొన్నారు. అందుకే కేసీఆర్‌ కాంగ్రెస్‌కి మొగ్గు చూపుతారని భావించవచ్చు.

ఈ నేపధ్యంలో మరోసారి ఇప్పుడు తెలంగాణ లెక్కలు సరిచూసుకొంటే, తెలంగాణలో బండి సంజయ్‌ని తొలగించుకొని బిజెపి బలహీనపడగా, రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించకుండా తమలో తాము కుమ్ములాడుకొంటున్న కారణంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా బలహీనంగా ఉంది. అంటే ఎన్నికలకు ముందు కేసీఆర్‌కు అనుకూల రాజకీయ వాతావరణం ఏర్పడిందన్న మాట!

కనుక ఈ మూడు నాలుగు నెలల్లో ఆ రెండు జాతీయ పార్టీలను ‘స్టేటస్ కో’ అంటే యదాతద స్థితిలో కొనసాగేలా కేసీఆర్‌ ‘అన్ని జాగ్రత్తలు తీసుకొంటారని’ వేరే చెప్పక్కరలేదు.

ఒకవేళ ఎన్నికలలోగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పుంజుకోగలిగితే అవి కేసీఆర్‌కు ఏమైనా పోటీ ఇవ్వగలవు. కేసీఆర్‌ హ్యాట్ ట్రిక్ కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

అయితే తెలంగాణలో కేసీఆర్‌కు పూర్తి అనుకూల వాతావరణం ఉందని చెప్పలేము. ఎందువల్ల అంటే దాని గురించి మరోసారి చెప్పుకొందాము.

ADVERTISEMENT
Latest Stories