ఒకరి సంక్షోభం మరొకరి గుణపాఠం…!

KCR Crisis is Lesson For Chandrababu Naidu

రాజకీయాలలో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే మాట ఎంత వాస్తవమో, అలాగే రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, పదవుల కోసం సొంత వారే కట్టప్పలు గా మారొచ్చు అనేది కూడా అంతే సత్యం.

ప్రస్తుతం తెలంగాణ ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ అంతర్గత విభేదాలతో రచ్చకెక్కింది. ఇప్పుడు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఇటు సోషల్ మీడియా వరకు మొత్తం బిఆర్ఎస్ లో కవిత సృష్టించిన లేఖాస్త్రం మీదే చర్చ నడుస్తుంది.

ADVERTISEMENT

పదేళ్లు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం కేసీఆర్ పేరు కూడా పలకడానికి భయపడిన వారు ఇప్పుడు నేరుగా కేసీఆర్ ను కాదని, ఆయన పై విమర్శలు చేస్తూ గులాబీ కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ఇక సొంత కూతురే తండ్రి నాయకత్వం పై ప్రశ్నలు ఎక్కుపెడుతూ లేఖలు రాసే స్థితికి వచ్చింది.

దీనికంతటికి కూడా పార్టీ ప్రతిపక్షంలోకి రావడం ఒక కారణమైతే, పార్టీలో కేసీఆర్ తరువాత స్థానం ఎవరన్నది మరో కారణం కావచ్చు. బిఆర్ఎస్ రెండవ సారి అధికారాన్ని అందిపుచ్చుకున్నప్పుడే బిఆర్ఎస్ భవిష్యత్ నాయకత్వాన్ని కేసీఆర్ అధికారికంగా ప్రకటించి పార్టీ శ్రేణులకు కేటీఆర్ ను బిఆర్ఎస్ కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ శ్రేణులకు పరిచయం చేసి ఉంటే ఇప్పుడు బిఆర్ఎస్ లో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆ దిశగా కేసీఆర్ రాజకీయ నిర్ణయాలు తీసుకుని ఉండి ఉంటే, అప్పుడా నిర్ణయాలను వ్యతిరేకించే సాహసం కానీ, ప్రశ్నించే అవకాశం కానీ ఏ ఒక్కరికి వచ్చి ఉండేది కాదు. అలాగే అటు కేటీఆర్ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఐటీ మంత్రిగా తన్ను తానూ నిరూపించుకున్నారు. అలాంటి సమయంలో అధికారంలో ఉన్న పార్టీని కాదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నిర్ణయాల పై విమర్శలు చేయడానికి ఎవరు ముందొచ్చే ప్రయత్నాలు చేసే వారు కాదు.

కానీ కేసీఆర్ ఆ విలువైన కాలాన్ని పార్టీ భవిష్యత్ కోసం వినియోగించుకోకుండా ప్రత్యర్థి పార్టీల పతనం కోసం వెచ్చించారు. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఒక పక్క పార్టీ ఓటమి మరో పక్క పార్టీలో అంతర్గత తిరుగుబాట్లు ఇలా ప్రతిపక్ష పార్టీ అధికారం పక్షం పై పోరాడాల్సిన సమయంలో పార్టీలో సొంత విభేదాలతో పంచాయితీ సర్దుబాట్లతో బిఆర్ఎస్ కుస్తీపట్లు పడుతుంది.

కేసీఆర్ అలసత్వం, అతి విశ్వాసం బిఆర్ఎస్ అస్తిత్వాన్ని ప్రశ్నించే స్థాయికి, కేసీఆర్ నాయకత్వాన్ని నిలదీసే స్థితికి చేరుకుంది. ఇప్పుడు ఇదే అంశం పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్రుష్టి పెట్టాలని, బిఆర్ఎస్ సంక్షోభం టీడీపీ కి గుణపాఠం కావాలని తెలుగు తమ్ముళ్లు టీడీపీ భవిష్యత్ నాయకుడిని ప్రకటించాలంటూ తమ గళం విప్పుతున్నారు.

రేపటి రోజున టీడీపీ ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండాలి అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, తండ్రి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడే టీడీపీ పూర్తి బాధ్యతలు నారా లోకేష్ కు అప్పగించి టీడీపీ కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్ కు మహానాడు సాక్షిగా రాజకీయ పట్టాభిషేకం చేయాలనే వాదన టీడీపీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తుంది.

రెండు దశాబ్దాల తరువాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేయడమే కాదు భవిష్యత్ లో మంగళగిరి పై మరే ఇతర పార్టీ నాయకుడు నీడ కూడా పడకుండా అక్కడ ప్రాంత ప్రజలను తన నాయకత్వంతో మెప్పిస్తున్నారు లోకేష్. అలాగే ఇటు ప్రభుత్వంలో ఐటీ, విద్య శాఖ మంత్రిగా తనదైన మార్క్ చూపిస్తూ అటు యువతకు, ఇటు విద్యార్థులకు దగ్గరయ్యారు.

పార్టీ పరంగా చూస్తే, గత వైసీపీ పాలనలో పార్టీ ఎదుర్కున్న ప్రతి సంక్షోభంలోనూ లోకేష్ తనదైన రాజకీయం చూపించారు. యువగళం పాదయాత్ర నుంచి బాబు అరెస్టు, ఆ తరువాత పరిణామాలతో టీడీపీ నాయకత్వ బాధ్యతలు భుజానకెత్తుకున్న లోకేష్ పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచారు. నాడు పప్పు అంటూ అవహేళన చేసిన వారే నేడు లోకేష్ రెడ్ బుక్ కు భయపడి రాష్ట్ర సరిహద్దులు దాటారు.

ఇలా లోకేష్ అటు పార్టీ పరంగాను, ఇటు ప్రభుత్వం పరంగాను ప్రజలలో మంచి గుర్తింపుని, గౌరవాన్ని పొందడంతో లోకేష్ పట్టాభిషేకానికి రేపు జరగబోయే మహానాడే సరైన వేదిక అంటూ టీడీపీ తమ్ముళ్లు చంద్రబాబు కి సూచనలు చేస్తున్నారు. మరి బాబు నిర్ణయం కేసీఆర్ మాదిరి ఉంటుందో లేక పార్టీ క్యాడర్ అభిష్టం మేరకు సాగుతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories