కేసీఆర్‌ అహంభావమే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి శ్రీరామరక్ష!

KCR-Ego

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళలో కేసీఆర్‌ ఎంతగానో అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ పధకాలు విజయవంతంగా అమలుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు నీళ్ళు పారించారు. అనేక పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలను, వాణిజ్య సంస్థలను రాష్ట్రాన్ని రప్పించి వాటితో రాష్ట్రానికి సంపద సృష్టించారు. వాటితో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు.

ADVERTISEMENT

చివరికి తెలంగాణ అభివృద్ధి కోసం ఆంధ్రా రాజధాని అమరావతి నిర్మించకుండా అడ్డుపడేందుకు కూడా కేసీఆర్‌ వెనకాడలేదు.

కనుక ఇక్కడ జగన్‌ చెప్పుకొంటున్నట్లు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో 117కి 117 స్థానాలు బిఆర్ఎస్‌ గెలుచుకొని ఉండాలి. కానీ కేసీఆర్‌ కారణంగానే బిఆర్ఎస్‌ ఓడిపోయింది. మిగిలిన కారణాలన్నిటి కంటే కేసీఆర్‌ అహంభావమే బి‌ఐ‌ఎస్ పార్టీకి శాపంగా మారిందని అందరికీ తెలుసు.

కేసీఆర్‌, బిఆర్ఎస్‌ నేతలు దానిని ఆత్మవిశ్వాసం అని అనుకోవచ్చు. కానీ ప్రజలకు అది అహంభావంగానే కనిపించింది. అందుకే కేసీఆర్‌ని కాదని రేవంత్‌ రెడ్డికి అధికారం కట్టబెట్టారు.

ఓటమి తర్వాత అయినా కేసీఆర్‌ తీరు మారుతుందని అని అనుకుంటే, నేటికీ కేసీఆర్‌ అదే అహంభావం ప్రదర్శిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్న నల్గొండ సభలో కాంగ్రెస్ మంత్రులకు ఏమీ తెలియదని, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని, వాళ్ళందరూ సన్నాసులు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు.

సుమారు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజిలో రెండు మూడు పిల్లర్లు నాలుగేళ్ళు కాకముందే క్రుంగిపోయి, బ్యారేజి గోడలు బీటలు వారితే తప్పేమిటని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఇది రాజకీయ సభ కాదు… తెలంగాణ హక్కుల కోసం జరుగుతున్న పోరాట సభ అంటూనే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని కేసీఆర్‌ చెప్పుకోవడం గమనిస్తే కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్‌ ఎంతగా పరితపించిపోతున్నారో అర్దమవుతుంది.

కేసీఆర్‌ యొక్క ఈ అహంభావమే బిఆర్ఎస్‌ పార్టీకి తీరని నష్టం కలిగించింది. అయినా తన తీరు మార్చుకునే ప్రసక్తే లేదని కేసీఆర్‌ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే బిఆర్ఎస్‌ పార్టీకి శాపంగా, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి శ్రీరామరక్షగా నిలువబోతోందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories